ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సెగలు రేగుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పరుగులు తీయడం ప్రారంభించాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లోనే బ్రెంట్ క్రూడ్ ధర 2% మేర పెరిగి, బ్యారెల్‌కు 72.48 డాలర్ల వద్ద స్థిరపడింది. యుద్ధం గనుక మరిన్ని రోజులు కొనసాగితే.. ఈ ధర బ్యారెల్‌కు 80 డాలర్ల మార్కును దాటుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిగుమతులపై ఆధారపడిన భారతదేశంలోని సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణం కానుంది.
ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఇరాన్ ఉత్తరాన.. ఒమన్, యూఏఈ, దక్షిణాన ఉన్న ఈ సన్నని సముద్ర మార్గం ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ లాంటిది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే క్రూడ్, LNGలో దాదాపు 20 నుంచి 30 శాతం ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. ఒకవేళ ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధిస్తే.. ప్రపంచ ఇంధన మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉంది. రోజుకు దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుండటంతో.. సప్లై చైన్ తెగిపోయి పెట్రో ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం.
భారత్ విషయానికి వస్తే.. మన దేశానికి అవసరమైన క్రూడ్ లో దాదాపు 60-70 శాతం పశ్చిమ ఆసియా దేశాల నుండే వస్తోంది. ప్రస్తుతం భారత్ ఇరాన్ నుంచి నేరుగా చమురు దిగుమతి చేసుకోకపోయినప్పటికీ.. సౌదీ అరేబియా నుంచి 13-17%, ఇరాక్ నుంచి 24%, యూఏఈ వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ దేశాలన్నీ చమురు రవాణాకు హోర్ముజ్ జలసంధినే వాడుతుంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంటే.. రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి దేశీయంగా పెట్రోల్, డీజిల్ లీటరు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు, ఇంధన ధరల పెంపు నిత్యావసర వస్తువుల రేట్లను భారీగా పెంచేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా తన క్షిపణి దాడులను ఇరాన్ సైనిక స్థావరాలకే పరిమితం చేసినప్పటికీ.. ఇరాన్ గనుక ఆర్థికపరమైన ఒత్తిడి తెచ్చేందుకు చమురు సరఫరాను అడ్డుకుంటే పరిస్థితి చేయిదాటిపోతుంది. దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్ ట్రేడ్ ఈ చిన్న సముద్ర మార్గంపైనే ఆధారపడి ఉంది. ఇరాన్ తన సైనిక బలగాలను హోర్ముజ్ ప్రాంతంలో మోహరించడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. చమురు ధరల పెరుగుదల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని తగ్గించేందుకు భారత్ వంటి దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలను సిద్ధం చేసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్రిక్తతలు ఎన్ని రోజుల్లో తగ్గుతాయనే అంశంపై సందిగ్దత కొనసాగుతున్న వేళ వాహనదారులు కూడా రేట్లు పెరగటానికి ముందే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే మంచిదని భావిస్తున్నారు.
