ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు.. ED ఎంట్రీ.. రూ. 5 కోట్లు ఫ్రీజ్!

ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు.. ED ఎంట్రీ.. రూ. 5 కోట్లు ఫ్రీజ్!

సినీ ఇండస్ట్రీకి వేల కోట్లలో నష్టాన్ని కలిగించిన పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' (iBomma) ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో  రవి తన దందాను  కేవలం పైరసీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కాకుండా.. అనేక అక్రమ కార్యకలాపాలు నిర్వహించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీని వెనుక అంతర్జాతీయ లింకులు కూడా ఉన్నాయని తేలింది. దేశ డిజిటల్ భద్రతకు రవి ప్రమాదకరం అని పోలీసులు  తెలిపారు.

 65 పైగా వెబ్‌సైట్లు.. బెట్టింగ్ దందా!

రవి ఐబొమ్మతో పాటు 'బప్పం' (bappam.TV) పేరు మీద 17 ప్రధాన వెబ్‌సైట్‌లు , 65కు పైగా మిర్రర్ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ పైరసీ సామ్రాజ్యం ఎంత విస్తరించిందంటే.. ప్రతి నెలా సుమారు 3.7 మిలియన్ల యూజర్లు ఈ సైట్‌లలో లాగిన్ అవుతున్నారు. ఈ భారీ ట్రాఫిక్‌ను ఉపయోగించుకుని.. రవి తన ఆదాయాన్ని పెంచుకోవడానికి యూజర్లను ప్రముఖ గేమింగ్ బెట్టింగ్ సైట్‌లకు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ద్వారా రవి భారీగా అక్రమ ఆదాయాన్ని సంపాదించినట్లు తేలడంతో, ఈ కేసు మనీలాండరింగ్ కోణం వైపు మళ్లింది.

 ED ఎంట్రీ..

ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు బలమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. నగదు బదిలీలపై దర్యాప్తు చేయడానికి హైదరాబాద్ సీపీకి ED లేఖ రాసింది. రవి తన క్రిప్టోకరెన్సీ వాలెట్‌లు, విదేశీ బ్యాంకు అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులను తన NRE ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు రవికి చెందిన దాదాపు రూ. 5 కోట్లు ఉన్న అకౌంట్‌లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.

విదేశీ పౌరసత్వం.. డొమైన్ల గుట్టు!

రవి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన కీలక ఆధారాలను రెండు డొమైన్‌లు పోలీసులకు అందించాయి. వాటిలో ఒకటి అమెరికాలో, మరొకటి అమీర్‌పేట్‌లో రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా నెవిస్ పౌరసత్వం తీసుకొని, అక్కడి పాస్‌పోర్ట్‌తో విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న పోలీసులు, రవి దేశ డిజిటల్ భద్రతకు ప్రమాదకరం అని రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

రవి వద్ద నుంచి  ఐఫోన్ 14 ప్లస్, సాంగ్ సంగ్ మొబైల్‌లు, నకిలీ పాన్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్, హార్డ్ డ్రైవ్‌లు, SSDలు, పెన్ డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రవి విచారణకు సహకరించకపోవడంతో, కీలకమైన డేటాను రికవరీ చేయడానికి అతడిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు..