ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ లో టీమిండియా 124 పరుగులను ఛేజ్ చేయలేక ఊహించని విధంగా ఓటమి పాలైంది. కేవలం 93 పరుగులకే ఆలౌటై 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో టీమిండియా సొంతగడ్డపై ఓడిపోవడం నిరాశకు గురి చేస్తుంది. గత ఏడాది న్యూజిలాండ్ పై టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో పాటు సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ ఓడిపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ అనూహ్య ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన నిరాశను వ్యక్తం చేశాడు. భారత జట్టును కాకుండా పిచ్ పై తీవ్ర విమర్శలు చేశాడు. టెస్ట్ క్రికెట్ నాణ్యత తగ్గుతుందని తెలిపాడు.
"టెస్ట్ క్రికెట్ పూర్తిగా నాశనమైంది. ఇండియాలో ఇలాంటి పిచ్ లు టెస్ట్ క్రికెట్ పై ఆసక్తిని తగ్గిస్తున్నాయి. ఇంగ్లాండ్ లో మ్యాచ్ లు అద్భుతంగా జరిగాయి. అక్కడ పిచ్ లు అద్భుతంగా ఉన్నాయి. టీమిండియా మ్యాచ్ లు గెలిచిన విధానాన్ని ప్రశంసించాము. అక్కడ నిజమైన టెస్ట్ క్రికెట్ థ్రిల్ కనిపించింది. కానీ ఇండియాలో పిచ్ లు బాగా లేవు. మీరు ఎక్కడ బౌలింగ్ చేసినా బంతి ఊహించని విధంగా తిరుగుతూనే ఉంటుంది. బ్యాటర్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. టెక్నిక్ ఎంత బాగున్నప్పటికీ ఇలాంటి పిచ్ లపై సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ బ్యాటింగ్ చేయడం కష్టం". అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు.
గౌహతి వేదికగా రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా రెండో టెస్ట్ గెలవడం చాలా కీలకం. గౌహతి టెస్టులో గెలిస్తేనే ఇండియా సిరీస్ సమం చేసుకుంటుంది. లేకపోతే 0-2 తేడాతో సిరీస్ కోల్పోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో వెనకపడుతుంది. గిల్ దూరం కావడం దాదాపు కన్ఫర్మ్ కావడంతో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ టీమిండియాను నడిపించనున్నాడు. ఈ మ్యాచ్ లో వికెట్ ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలిస్తున్నటు సమాచారం. తొలి టెస్ట్ ఓటమి తర్వాత పిచ్ ఎలా ఉంటుందో టీమిండియా ఎలా కంబ్యాక్ ఇస్తుందో చూడాలి.
