Team India: అయ్యర్ ఔట్.. గిల్ డౌట్: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మకు కెప్టెన్సీ

Team India: అయ్యర్ ఔట్.. గిల్ డౌట్: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మకు కెప్టెన్సీ

సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి జట్టును లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సఫారీలతో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డే నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో రోహిత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్టు సమాచారం. టీమిండియా వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్.. వైస్ కెప్టెన్ గాయాలతో ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గిల్ ప్రస్తుతం మెడ నొప్పితో బాధపడుతున్నాడు. డాక్టర్లు రెస్ట్ అవసరమని సూచించడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. 

ఒకవేళ గిల్ కోలుకోకపోతే అతని స్థానంలో వైస్ కెప్టెన్ గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ భారత జట్టును నడిపించాల్సి ఉంది. అయితే శ్రేయాస్ కూడా గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ ఆడడం అనుమానంగా మారింది. ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడుతూ అయ్యర్ గాయపడ్డాడు. క్యాచ్ ఆదుకునే క్రమంలో అయ్యర్ డైవ్ చేయడంతో అతని పక్కటెముకలకు గాయమైంది. గాయంతో ఇబ్బందిపడుతున్న శ్రేయాస్ ఈ నెలాఖరులోగా కోలుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. రిపోర్ట్స్ అయ్యర్ కు మరో నెల రోజుల పాటు రెస్ట్ కావాలని సూచిస్తున్నాయి. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరూ లేకపోవడంతో ఇప్పుడు భారత జట్టును ఎవరు నడిపిస్తారనే చర్చ జరుగుతోంది. 

ప్రస్తుతం టీమిండియాలో  రోహిత్ శర్మకు మాత్రమే కెప్టెన్సీ అనుభవం ఉంది. దీంతో హిట్ మ్యాన్ మరోసారి కెప్టెన్సీ రేస్ లో కనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. తొలి వన్డేలో విఫలమైనా రెండో వన్డేలో హాఫ్ సెంచరీ ( 97 బంతుల్లో 73) చేసి రాణించాడు. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో చెలరేగుతూ సెంచరీ (125 బంతుల్లో 121) పరుగులు మార్క్ అందుకున్నాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.  

సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కు జట్టును బుధవారం (నవంబర్ 19) ప్రకటించే అవకాశం ఉంది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నవంబర్ 30 న తొలి వన్డే.. డిసెంబర్ 3 న రెండో వన్డే.. డిసెంబర్ 6 న మూడో వన్డే జరుగుతుంది. తొలి మూడు వన్డేలకు వరుసగా రాంచీ, రాయ్‌పూర్,విశాఖపట్నం ఆతిధ్యమిస్తాయి. వన్డే మ్యాచ్ లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి.