తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ దూకుడు పెంచింది. అన్ని శాఖలను జల్లెడ పడ్తుంది. లంచగొండుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా.. ఏ హోదాలో ఉన్నా.. ఉపేక్షించొద్దని తేల్చిచెప్పింది. ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో లంచాల విషయం తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ టోల్‌ఫ్రీ నంబర్‌ను, వాట్సాప్ నంబర్‌ను జనంలోకి విస్తృతంగా ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు. దీంతో బాధితుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి.. లంచగొండులకు చెక్ పెడ్తున్నారు. ఎక్కడిక్కడ లంచగొండులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది.
లేటెస్ట్ గా నవంబర్ 18న మెదక్ జిల్లా టెక్మాల్ ఎస్సై రాజేశ్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల రాకను గమనించిన ఎస్సై రాజేశ్ స్టేషన్ పై నుంచి దూకి పారిపోతుండగా దాదాపు కిలోమీటర్ దూరం వెంబడించి మరీ పట్టుకున్నారు. వరి కోత మిషన్ కేసు విషయంలో రైతు దగ్గర డబ్బులు తీసుకుంటుండగా పట్టుబడినట్లు సమాచారం. ఏసీబీ ఎస్ఐని పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నవంబర్ 17న రేషన్ డీలర్ నుంచి రూ.30 వేలు తీసుకుంటూ ఇల్లెందు సివిల్ సప్లై డీటీ మహ్మద్ యాకూబ్‌పాషా, ఈపోస్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్, రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఇల్లెందు అధ్యక్షుడు శబరీశ్‌ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నవంబర్ 15న ఒకే రోజు 23 టీమ్స్ తో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై సోదాలు చేసి రూ. 2 లక్షల 52 వేల అకౌంటింగ్ లేని డబ్బును సీజ్ చేశారు అధికారులు.
