మా శరీర భాగాలపై జూమ్ ఏంటి? ఫోటోగ్రాఫర్ల తీరుపై హీరోయిన్ల ఆవేదన..!

మా శరీర భాగాలపై జూమ్ ఏంటి? ఫోటోగ్రాఫర్ల తీరుపై హీరోయిన్ల ఆవేదన..!

సినీ తారలు అంటే వెండితెరపై మెరిసే దేవతలుగా భావిస్తారు అభిమానులు. కానీ, ఆ గ్లామర్ వెనుక వారు ఎదుర్కొనే అసౌకర్యం, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల కాలంలో ముంబై 'పాపారాజీ' (Paparazzi) కల్చర్ దక్షిణాదికి కూడా పాకింది. సెలబ్రిటీలు ఎక్కడ కనిపిస్తే అక్కడ కెమెరాలతో వాలిపోవడం వరకు అంతా బానే ఉంది. కానీ ఆ కెమెరా లెన్స్‌లు వెతుకుతున్న కోణాలు (Angles) ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

హద్దులు దాటుతున్న కెమెరా కళ్లు..

నటీమణుల నటనను, వారి ప్రతిభను పక్కన పెట్టి.. కేవలం వారి శరీర భాగాలను అనుచితంగా చూపిస్తూ వ్యూస్ కోసం పాకులాడుతున్న కొందరు ఫొటోగ్రాఫర్ల తీరుపై దక్షిణాది హీరోయిన్లు ఇప్పుడు గళమెత్తారు. కన్నడ భామలు సప్తమి గౌడ, రుక్మిణి వసంత్, ఆషిక రంగనాథ్ వంటి వారు ఇన్ స్టా వేదికగా తమ నిరసనను వ్యక్తం చేశారు. "మేము ఇక్కడ ఉన్నది మా కళ కోసం, మా సినిమా కోసం.. అంతేకానీ మా శరీర భాగాలను జూమ్ చేసి చూపించడానికి కాదు" అంటూ వారు పెట్టిన పోస్ట్‌లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఏమిటీ ఇన్-అప్రాప్రియేట్ జూమ్ కల్చర్?

పబ్లిక్ ఈవెంట్స్‌లో, ఎయిర్‌పోర్ట్ దగ్గర హీరోయిన్లు కనిపిస్తే, ఫోటోగ్రాఫర్లు వారిని ఫోటోలు తీయడం సహజం. అయితే, ఇటీవల కాలంలో కొందరు ఉద్దేశపూర్వకంగా నటీమణులు కారు దిగేటప్పుడు, కూర్చునేటప్పుడు, ఈవెంట్స్ లలో అనుచితమైన యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తున్నారు. వస్త్రధారణలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని హైలైట్ చేస్తూ జూమ్ చేస్తున్నారు. యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ కోసం అసభ్యకరమైన రీతిలో ఫోటోలను ఎడిట్ చేయడం చేస్తున్నారంటూ హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఒక వృత్తిపరమైన నేరం అని  మండిపడుతున్నారు. "ఇది మా హుందాతనాన్ని దెబ్బతీయడమే కాకుండా, మమ్మల్ని మానసిక వేదనకు గురిచేస్తోంది" అని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..

►ALSO READ | Sneha: నరకం అనుభవించా.. మళ్ళీ సినిమాల్లోకి వస్తాననుకోలేదు.. స్నేహ ఎమోషనల్!

గళమెత్తిన అగ్ర తారలు

గతంలో బాలీవుడ్ భామలు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహి వంటి వారు కూడా ఈ తరహా ఫొటోగ్రాఫర్ల తీరును బహిరంగంగానే తప్పుబట్టారు. మేము జిమ్ నుండి వస్తున్నప్పుడు, సాధారణంగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కెమెరాలు వెనుక నుండి అనుచితంగా ఫోకస్ చేయడం ఏ రకమైన జర్నలిజం? అని వారు ప్రశ్నించారు. సౌత్ హీరోయిన్లు ఇప్పుడు ఈ విషయంలో ఏకతాటిపైకి వచ్చారు. గౌరవప్రదంగా వ్యవహరించే కెమెరా జర్నలిస్టులను తాము ఎప్పుడూ గౌరవిస్తామని చెప్తూనే.. కేవలం వ్యూస్ కోసం సభ్యతను మర్చిపోయే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 మార్పు ఎక్కడ రావాలి?

సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు, ప్రైవసీకి గౌరవం ఇవ్వడం కనీస బాధ్యత. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కోసం ఒక మహిళా నటి గౌరవంతో ఆడుకోవడం ముమ్మాటికీ తప్పే. మీడియా మిత్రులు 'ప్రొఫెషనలిజం' పాటిస్తూ, కేవలం ప్రతిభకు ప్రాధాన్యత ఇచ్చేలా ఫోటోగ్రఫీ ఉండాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. ఈ పోరాటంలో నటీమణులందరూ ఐక్యంగా నిలవడం ఒక శుభపరిణామని పేర్కొంటున్నారు.