హైదరాబాద్: మూవీ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవిని ఎన్ కౌంటర్ చేయాలని ప్రముఖ నిర్మాత సీ. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (నవంబర్ 18) తెలుగు ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. మూవీ పైరసీకి పాల్పడుతోన్న ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు.
అనంతరం ఛాంబర్ ప్రతినిధులు మూవీ పైరసీపై మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్మాత సీ. కల్యాణ్ మాట్లాడుతూ.. కోట్లు పెట్టి సినిమా తీస్తే పైరసీ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీతో మూవీ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం వాటిల్లేలా చేసిన రవిని అరెస్ట్ చేసిన ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ను సినీ ఇండస్ట్రీ తరుఫున త్వరలో సన్మానిస్తామని చెప్పారు.
►ALSO READ | ఐబొమ్మ కేసులోకి ఈడీ ఎంట్రీ.. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సీపీకి లేఖ
నిర్మాత చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని ప్రశంసించారు. ఐబొమ్మ సైట్ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చాలా కష్టపడ్డారని కొనియాడారు.
బడ్జెట్ పెంచి సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచుతున్నారని.. ఇది తప్పన్నారు. బడ్జెట్లో 90 శాతం ఆర్టిస్టులకి ఇస్తున్నారని.. ఆ భారం ప్రేక్షకుల మీద పడుతుందని అన్నారు.
చిత్ర పరిశ్రమకు పెను సవాలుగా మారిన 'ఐబొమ్మ' పైరసీ వెబ్‌సైట్ కింగ్‌పిన్ ఇమ్మడి రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరిన రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు.
