కర్ణాటక సంచలనం.. బెంగళూరు వదిలి వెళ్లిపోయేందుకు స్టార్టప్ కంపెనీలకు భారీ ఆఫర్లు..

కర్ణాటక సంచలనం.. బెంగళూరు వదిలి వెళ్లిపోయేందుకు స్టార్టప్ కంపెనీలకు భారీ ఆఫర్లు..

ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరం నుంచి టెక్ కంపెనీలు బయటకు రావాలన్న సంకల్పంతో కర్ణాటక ప్రభుత్వం సరికొత్త ప్రయోగం ప్రారంభించింది. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన “IT Policy 2025–2030” పాలసీ చాలా సంస్థలను ఆకట్టుకుంటోంది. దీని కింద స్టార్టప్‌లు, టెక్ కంపెనీలు టైర్ 2 నగరాలకు మారితే కోట్ల రూపాయల సబ్సిడీలు, పన్ను రాయితీలు ఆఫర్ చేస్తోంది అక్కడి ప్రభుత్వం.

ఈ ప్రోత్సాహకాల్లో ప్రధానంగా గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు 50 శాతం అద్దె రాయితీ, మూడు సంవత్సరాల పాటు 30 శాతం ఆస్తి పన్ను మినహాయింపు, 5 ఏళ్ల పాటు విద్యుత్ చార్జీలపై 100 శాతం మినహాయింపును అందిస్తోంది. అదే కాకుండా కంపెనీలకు ఫోన్, ఇంటర్నెట్ ఖర్చుల్లో 25 శాతం, అలాగే AI, బ్లాక్‌చెయిన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక రంగాల్లో పరిశోధన ఖర్చులపై 40 శాతం వరకు (గరిష్టంగా రూ.50 కోట్లు వరకు) రీఫండ్ పొందే అవకాశం కల్పించింది.

ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సార్థక్ అహూజా ఈ అంశాన్ని లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేయడంతో టెక్ కమ్యూనిటీలో చర్చలు జోరందుకున్నాయి. ప్రభుత్వం ఐటీ పాలసీలో భాగంగా బెంగళూరు వదిలి కంపెనీలు మైసూర్, మంగళూరు వంటి నగరాలకు మారేందుకు డబ్బు ఆఫర్ చేస్తోందని ఆయన అన్నారు. ఈ ప్లాన్ కోసం 5 ఏళ్ల కాలానికి కర్ణాటక ప్రభుత్వం రూ.960 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అయితే ప్రోత్సాహకాలను 100 కంపెనీలకు మాత్రమే పరిమితం చేసిందని చెప్పారు. అందువల్ల ముందుగా దరఖాస్తు చేసుకునేవారికి ఎక్కువ అవకాశాలు ఉండనున్నాయి. డిసెంబర్ మొదటి లేదా రెండవ వారంలో దరఖాస్తు విధానంపై పూర్తి మార్గదర్శకాలు వస్తాయని అహుజా అన్నారు. 

►ALSO READ | అమెరికా యూనివర్సిటీల్లో తగ్గిన భారత విద్యార్థుల అడ్మిషన్లు.. కానీ..

కర్ణాటక ప్రభుత్వ “బియాండ్ బెంగళూరు” వ్యూహానికి కీలక భాగంగా ఇది మారనుందని చెప్పారు. కర్ణాటకలోని ఇతర నగరాలైన మైసూరు, మంగళూరు, హుబ్బిళి, ధారవాడ, బేలగావి, కలబురిగి, శివమెుగ్గ, దావణగెరె, తుమకూరు వంటి నగరాలు ఐటీ -ఆధారిత కేంద్రాలుగా మారడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయని చెప్పారు. ఈ గోల్డెన్ చాన్స్ కంపెనీలు అస్సలు మిస్ కావొద్దని అన్నారు. అలాగే కొత్త ఐటీ గ్రోత్ ఇంజన్లను కొత్త ప్రాంతాలకు విస్తరించటం నగరంలో రద్దీ, పొల్యూషన్ వంటి సమస్యలకు కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.