Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్నలెజెండ్ మూవీ హీరోయిన్.. దయచేసి ఇండియాకు చేర్చండని మోడీకి విన్నపం

Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్నలెజెండ్ మూవీ హీరోయిన్.. దయచేసి ఇండియాకు చేర్చండని మోడీకి విన్నపం

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడులు, దానికి ప్రతికారంగా ఇరాన్ చేపట్టిన చర్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా యుద్ధ భయం నెలకొంది. ఈ పరిణామాల ప్రభావంతో గల్ఫ్ దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఎంతోమంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు.

ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ, లెజెండ్ మూవీ హీరోయిన్ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) దుబాయ్‌లో చిక్కుకుపోయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విమానాలు రద్దుకావడంతో భారత్‌కు తిరిగి రావడానికి స్పష్టమైన మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై ఆమె భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి సహాయం కోరారు.

“గౌరవనీయులైన ప్రధాని గారూ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో నేను దుబాయ్‌లో చిక్కుకుపోయాను. విమానాలు రద్దు కావడంతో భారత్‌కు తిరిగి వెళ్లేందుకు మార్గం కనిపించడం లేదు. సురక్షితంగా స్వదేశానికి చేరుకునేందుకు ప్రభుత్వ మార్గదర్శకత్వం, మద్దతు కోరుతున్నాను” అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ, దుబాయ్‌లోని భారత కార్యాలయాన్ని కూడా ట్యాగ్ చేశారు.

సోనాల్ చౌహాన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు భారత అధికారులు వెంటనే స్పందించాలని కోరుతుండగా, మరికొందరు భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించడం సరైన మార్గమని సూచించారు.

ఈ పరిణామాలపై స్పందించిన భారత రాయబార కార్యాలయం, అబుదాబి ఒక ప్రకటన విడుదల చేసింది. యూఏఈ అధికారులు, ఎయిర్‌లైన్స్‌తో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, తాత్కాలిక గగనతల మూసివేత కారణంగా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రతకు పూర్తి సహకారం అందిస్తున్నామని వెల్లడించింది. యూఏఈ ప్రభుత్వం, విమానయాన సంస్థలు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి రావాలని, విమాన సర్వీసులు పునరుద్ధరించబడాలని అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సోనాల్ చౌహాన్ సినిమాలు:

ఇదిలా ఉండగా, హిందీ, తెలుగు సినిమాల్లో నటించిన సోనాల్ చౌహాన్, జన్నత్ సినిమాతో విశేష గుర్తింపు పొందారు. బాలకృష్ణతో లెజెండ్, డిక్టేటర్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. అలాగే, రామ్ తో పండగ చేస్కో, కళ్యాణ్ రామ్ షేర్, ఆర్య సైజ్ జీరో, ప్రభాస్ ఆదిపురుషుడు వంటి సినిమాల్లో నటించింది.