ఖమేనీ మరణ వార్త చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్

ఖమేనీ మరణ వార్త చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్

టెహ్రాన్: ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖమేనీ మరణవార్త చదువుతూ ఇరాన్ స్టేట్ మీడియా ప్రెజెంటర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘గొప్ప విప్లవ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన నేరపూరిత దాడిలో అమరుడయ్యారని ఇరాన్ దేశానికి తీవ్ర దుఃఖంతో ప్రకటిస్తున్నాం’’ అని తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ  ప్రకటించాడు. 

ఇదే సమయంలో ఖమేనీ చావుకు కారణమైన ట్రంప్‎కు యాంకర్ లైవ్‎లోనే వార్నింగ్ ఇచ్చాడు. ఇది ఇక్కడితో ముగియలేదని.. ఖమేనీ మరణానికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు. -గతంలో ఏ అమెరికన్ అధ్యక్షుడు లేనంతగా ట్రంప్ మూల్యం చెల్లించుకుంటాడని వార్నింగ్ ఇచ్చాడు. త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని.. ట్రంప్‎తో పాటు ఖమేనీ హత్యలో పాల్గొన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నాడు. 

ఖమేనీ మృతికి ఇరాన్ ప్రతీకార దాడులు:

సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ రివేంజ్ ఎటాక్స్ మొదలుపెట్టింది. పశ్చిమాసియాలో 27 చోట్ల దాడులు చేసింది. గల్ఫ్ దేశాలు దుబాయ్, దోహా, బహ్రెయిన్, ఖతార్‌, యూఏఈ, కువైట్, జోర్డాన్, సౌదీలోని యూఎస్ సైనిక స్థావరాలపై ఏక కాలంలో అటాక్స్ చేస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ ఎటాక్ చేసింది. 

ఈ ఘటనలో ఎయిర్ పోర్టు స్వల్పంగా ధ్వంసమైంది. ఖమేనీ హత్య తర్వాత దుబాయ్‎లో అత్యంత ఎత్తైన బుర్జా ఖలీఫా టవర్‎పై మరోసారి దాడికి యత్నించింది. అలాగే, లెబనాన్‎లోని యూఎస్ ఎంబసీపై విరుచుకుపడింది. ఇదే సమయంలో బహ్రెయిన్‎లోని మనామాలో క్రౌన్ ప్లాజా హోటల్‌పై డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో హోటల్ ధ్వంసమైంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్‎ నివురుగప్పిన నిప్పులా మారింది.