ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం : 3,500 విమానాలు రద్దు.. ప్రయాణికులకు అలర్ట్ !

  ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం : 3,500 విమానాలు రద్దు.. ప్రయాణికులకు అలర్ట్ !

 శనివారం (ఫిబ్రవరి 28) తెల్లవారుజామున ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడులతో ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగడంతో పరిస్థితులు యుద్ధానికి దారితీశాయి. దింతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా చాలా దేశాలు  గగనతలాన్ని (Airspace) మూసివేశాయి.

ఇజ్రాయెల్, ఇరాన్, యూఏఈ, ఖతార్, కువైట్, ఇరాక్, జోర్డాన్  దేశాలు వాటి  మీదుగా విమానాలు వెళ్లకుండా ఆంక్షలు విధించాయి. ఇప్పటి వరకు దాదాపు 3 వేల 500 కంటే ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయి. ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి పెద్ద సంస్థలు దుబాయ్, అబుదాబి, దోహా నుండి నడిచే  విమానాలన్నీ నిలిపివేశాయి.

భారతదేశంపై ప్రభావం:
భారత్ నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇండియా నుండి వెళ్లే చాలా విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్ని విమానాలను మార్చి 2వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాసా ఎయిర్ సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వ హెచ్చరిక: ఇరాన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల మీదుగా విమానాలు నడపవద్దని DGCA హెచ్చరించింది.

ప్రయాణికులు ఏం చేయాలి?
 మీరు ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటే, ఇంటి నుండి బయలుదేరే ముందే మీ విమానం ఉందో లేదో ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లో చూసుకోండి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రముఖ  విమానాశ్రయాలు ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాయి.సమన్వయం: విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.