పాప చనిపోయాక ఏమీ తెలీనట్టు ఆసుపత్రికి.. కోరుట్ల చిన్నారి పిన్ని మమత వీడియో బయటకి !

పాప చనిపోయాక ఏమీ తెలీనట్టు ఆసుపత్రికి.. కోరుట్ల చిన్నారి పిన్ని మమత వీడియో బయటకి !

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన చిన్నారి హత్య కేసులో నిందితురాలిగా భావిస్తున్న ఆ పాప పిన్ని మమత.. పాప చనిపోయిన తర్వాత ఏమీ తెలియనట్లుగా కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రికి వెళ్ళింది. ఇందుకు సంబంధించిన వీడియో బయటికొచ్చింది. ఆ వీడియోలో కుటుంబ సభ్యులతో కలిసి బాధపడుతున్నట్టుగా మమత కనిపించడం కొసమెరుపు. కోరుట్లలో హత్యకు గురైన చిన్నారి హితీక్ష అంతిమ యాత్రకు స్థానికులు పెద్ద సంఖ్యలో భాగం కావడం గమనార్హం. చిన్నారి హత్య కేసు దర్యాప్తును పోలీసులు స్పీడప్ చేశారు. ఇంటి పోరుతోనే పాపను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

శనివారం రాత్రి నుంచి పాప చిన్నమ్మ మమతను పోలీసులు విచారిస్తున్నారు. కోరుట్ల ఆదర్శ్ నగర్ కాలనీలోని రామ్, నవీన దంపతుల కూతురు, ఐదేళ్ల చిన్నారి హితీక్షను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. పాప తండ్రి రామ్, బాబాయ్ లక్ష్మణ్ కవలపిల్లలు. పాప తండ్రి రామ్తో పాటు ఆ చిన్నారి తాత, బాబాయ్ కూడా దుబాయ్లో ఉంటున్నారు. రామ్కు ఏడు సంవత్సరాల బాబు, ఐదేళ్ల హితీక్ష ఉన్నారు. లక్ష్మణ్కు ఇద్దరు ఆడ పిల్లలు.

ఇంట్లో తల్లి, నానమ్మ, పిన్నితో పాప హితీక్ష ఉంటోంది. శనివారం సాయంత్రం హితిక్ష తోటి పిల్లలతో కలిసి ఇంటిముందు దాగుడుమూతల ఆట ఆడుతూ.. దాచుకునే క్రమంలో పక్కింట్లోకి వెళ్లింది. ఆ తర్వాత చిన్నారి కనిపించలేదు. పాప కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఎంత వెతికినా జాడ తెలియలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు ఓ ఇంట్లో పరిశీలించగా.. బాత్రూమ్లో రక్తపు మడుగులో హితిక్ష డెడ్ బాడీ కనిపించింది. చిన్నారి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క మమత మాత్రమే ఈ చిన్నారిని హత్య చేసిందా (లేదా) పాప హత్యకు ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.