- డబ్బులు తీసుకుని ఒకరికి బదులు మరొకరిని కోర్టుకు పంపుతూ దందా
- రూ.30 లక్షలకుపైగా వసూలు చేసినట్లు గుర్తింపు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కిన వ్యక్తుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసి.. వారికి బదులు మరో వ్యక్తిని కోర్టులో హాజరుపరిచిన వ్యవహారంలో ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ వ్యవహారంలో ఆర్ఎస్సై శనిగల శ్రీకాంత్, కోర్టు డిస్పోజల్ కానిస్టేబుల్ సాయి, ట్రాఫిక్ స్టేషన్ రైటర్ కిరణ్(పీసీ)ను సీపీ గౌష్ ఆలం సస్పెండ్ చేశారు. 130 కేసుల్లో సుమారు రూ.30 లక్షలకుపైగా వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కేసుల సంఖ్యతోపాటు వసూలు చేసిన మొత్తం రెట్టింపు స్థాయిలో ఉండొచ్చని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో ఇంకా లోతుగా విచారిస్తున్నారు.
ముగ్గురు కుమ్మక్కయి గుట్టుగా వసూళ్లు
డ్రంకెన్డ్రైవ్లో చిక్కినవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి మరుసటి రోజు కోర్టులో హాజరుపరుస్తుంటారు. అయితే కోర్టుకు వెళ్తే జైలు శిక్ష పడుతుందనే వాహనదారుల భయాన్ని ఆసరాగా చేసుకున్న కరీంనగర్ ట్రాఫిక్ విభాగంలో పనిచేసే ఆర్ఎస్సై, స్టేషన్ రైటర్, కోర్టు కానిస్టేబుల్ వసూళ్లకు తెరలేపారు. వాహనదారుడి ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల నుంచి 50 వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది.
పట్టుబడ్డ కొందరు డాక్టర్లు, వ్యాపారులు రూ.లక్ష వరకు ముట్టజెప్పినట్టు సమాచారం. వారికి బదులు ఈ కేసుల్లో వేరొకరిని పంపి, అలా వెళ్లినవారికి ఎంతోకొంత ఇచ్చేవారు. ఈ వ్యవహారం సీపీ గౌష్ ఆలం దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టి ఆ ముగ్గురిని మొదట హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. ఎంక్వైరీ పూర్తి కావడంతో వేటు వేశారు. వీరిలో కోర్టు కానిస్టేబుల్ సాయి ఇంకా ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నట్లు తెలిసింది.
