
సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth), దిగ్గజ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రానున్న యాక్షన్ చిత్రం 'కూలీ' (Coolie). ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ స్టైల్, రజినీకాంత్ స్టైల్ కలవడం ఒక ఎత్తయితే, బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ( Aamir Khan) ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనుండటం మరో హైలైట్.
అయితే, ఇప్పుడు 'కూలీ' గురించి వచ్చిన తాజా వార్త సినీ అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని కేవలం భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాతలు ఈ పాన్ ఇండియా చిత్రానికి భారీ గ్లోబల్ రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
100 దేశాల్లో 'కూలీ' మూవీ విడుదలకు ప్లాన్!
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కూలీ'లో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆయనకు ఆమిర్ ఖాన్ పాత్రతో భీకరమైన క్లాష్ ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అంతర్జాతీయ పంపిణీ బాధ్యతలను హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ అనే ప్రముఖ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో 130కి పైగా సినిమాలను విడుదల చేసిన ట్రాక్ రికార్డ్ కూడా హంసిని ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఉంది. భారతీయ సినిమాను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడంలో వారికి విస్తృతమైన అనుభవం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకోని ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే బాధ్యతలు ఈ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు అప్పగించినట్లు సమాచారం.
ALSO READ | Kannappa: రెండో వారంలో తగ్గిన 'కన్నప్ప' దూకుడు: బాక్సాఫీస్ గ్రాఫ్ డౌన్!
ఇటీవల హంసిని సంస్థ విజయ్( Vijay ) నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) చిత్రాన్ని 40కి పైగా దేశాల్లో, జూనియర్ ఎన్టీఆర్ ( Jr.NTR ) నటించిన 'దేవర' చిత్రాన్ని 90కి పైగా దేశాల్లో విడుదల చేసింది. 'కూలీ' చిత్రంతో హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ తమ అతిపెద్ద విడుదలకు సిద్ధమవుతోంది. 100కు పైగా దేశాల్లో ఈ చిత్రాన్ని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే నిజమైతే 'కూలీ' ఒక భారతీయ చిత్రానికి అత్యంత విస్తృతమైన అంతర్జాతీయ విడుదలల్లో ఒకటిగా నిలవనుంది.
'కూలీ' వర్సెస్ వార్ 2:
రజినీకాంత్ తో పాటు, ఈ చిత్రంలో భారతీయ చిత్ర పరిశ్రమలోని సీనియర్ నటులైన ఆమీర్ ఖాన్, నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ వంటి తారలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరో వైపు ఈ సినిమా కమల్ హాసన్ నటించిన 'తగ్ లైఫ్' వంటి భాషా వివాదాలకు దూరంగా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రధానంగా బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. కళానిధి మారన్కు చెందిన సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రజినీకాంత్ కు 'కూలీ'171వ చిత్రం. ఈ 'కూలీ' బాక్సాఫీస్ వద్ద 'వార్ 2' వంటి భారీ చిత్రంతో పోటీపడనుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఏ మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.