- ప్రభుత్వానికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రపోజల్స్
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో సాంక్షన్ ఎస్జీటీ పోస్టుల రద్దుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కొత్త పోస్టుల మంజూరు కోసం.. పాత సాంక్షన్ పోస్టులను సరెండర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైస్కూళ్లలో హెడ్మాస్టర్లు , పీఈటీ పోస్టుల కోసం.. ప్రైమరీ స్కూల్స్‌లో కీలకమైన ఎస్జీటీ పోస్టులకు ఎసరు పెట్టింది.
కొత్తగా 2,064 పోస్టుల కోసం 2,325 ఎస్జీటీ పోస్టులను సరెండర్ చేసేందుకు ప్రతిపాదనలను ఇటీవల అధికారులు సర్కారుకు పంపించారు. దీనికి అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్.. విద్యా శాఖ సెక్రటరీకి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,701 ప్రభుత్వ హైస్కూళ్లు ఉండగా.. వాటిలో 295 హైస్కూళ్లు హెడ్మాస్టర్లు లేకుండానే నడుస్తున్నాయి.
దీంట్లోనూ 34 స్కూళ్లు జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో ఉండగా, మిగిలిన 261 స్కూళ్లకు హెచ్‌ఎంలు కావాల్సి ఉంది. మరోపక్క 1,837 హైస్కూళ్లలో పీఈటీ పోస్టులే లేవు. పిల్లలు లేని 34 స్కూళ్లను మినహాయిస్తే.. మరో 1,803 పీఈటీ పోస్టులు అవసరం ఉన్నాయి. ఈ స్కూళ్లకు కొత్త పోస్టులను సాంక్షన్ చేయించాలని అడగాల్సిన అధికారులు.. ఉన్న పోస్టులను సరెండర్ చేసి, వాటి స్థానంలో కొత్త పోస్టులు ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టడంపై టీచర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, గత బీఆర్ఎస్ సర్కారులో మిగులు పోస్టులన్నీ ఉమ్మడి పది జిల్లాల డీఈవో పూల్‌లో పెట్టారు.
అడ్జస్ట్మెంట్ ఇలా..
కొత్త పోస్టుల కోసం ఖజానాపై భారం పడకుండా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ‘మ్యాచింగ్’ఫార్ములా తెరమీదికి తెచ్చారు. ఒక్కో హెడ్‌మాస్టర్ పోస్టుకు రెండు ఎస్జీటీ పోస్టులను (1:2 నిష్పత్తిలో) రద్దు చేస్తారు. అంటే 261 హెచ్ఎం పోస్టుల కోసం 522 ఎస్జీటీ పోస్టులను సరెండర్ చేయనున్నారు. పీఈటీ, ఎస్జీటీ క్యాడర్ సమానం కాబట్టి.. ఒక్కో పీఈటీ పోస్టుకు ఒక ఎస్జీటీ పోస్టును (1:1 నిష్పత్తిలో) రద్దు చేస్తారు. అంటే 1,803 పీఈటీల కోసం 1,803 ఎస్జీటీ పోస్టులను సరెండర్ చేస్తారు. ఈ లెక్కన మొత్తం 2,064 కొత్త పోస్టుల కోసం.. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,325 ఎస్జీటీ పోస్టులను రద్దు చేయనున్నారు.
గద్వాల, మేడ్చల్ జిల్లాలు మినహా మిగిలిన 31 జిల్లాల్లో ఎస్జీటీ పోస్టులకు కోత పడనున్నది. దీంట్లో అత్యధికంగా నల్లొండ జిల్లాలో 407 ఎస్జీటీ పోస్టులు, హైదరాబాద్ జిల్లాలో 306, మహబూబాబాద్‌లో 237, సంగారెడ్డిలో 212, వికారాబాద్‌లో 204, జనగామలో 189, సూర్యాపేటలో 168 ఎస్జీటీ పోస్టులు మిగులుగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.
ఈ నిర్ణయం వెనక్కి తీసుకోండి..
రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో డీఈఓ పూల్‌లో చాలా పోస్టులు ఉన్నాయి. వాటిని సరెండర్ చేయాలి కానీ.. ఉన్న ఎస్జీటీ పోస్టులను రద్దు చేయడం సరికాదు. ఇప్పటికే ఎస్జీటీలు 20, 30 ఏండ్లుగా ప్రమోషన్లు రాని వాళ్లున్నారు. సర్కారు నిర్ణయంతో మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అధికారులు వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మహిపాల్ రెడ్డి, ఎస్జీటీయూ స్టేట్ ప్రెసిడెంట్
