- కలెక్టర్ కుమార్దీపక్
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల పరిధిలో మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురయ్యే భూముల సేకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో ఆఫీస్లో గురువారం ఆర్డీవో శ్రీనివాస్ రావుతో కలిసి భూసేకరణ ప్రక్రియపై రివ్యూ నిర్వహించారు.
మేడిగడ్డ బ్యాక్ వాటర్ కారణంగా కోటపల్లి మండల పరిధిలోని దేవులవాడ, అర్జునగుట్ట, రావులపల్లి, రాపనపల్లి గ్రామాల భూములు ప్రభావితమయ్యే అవకాశం ఉందని.. భూసేకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. అర్హులైన రైతులకు నష్టపరిహారం అందించేందుకు భూసేకరణ సక్రమంగా నిర్వహించాలని, ప్రక్రియ స్పీడప్ చేసి త్వరగా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలింగ్పక్కాగా నిర్వహించాలి
కలెక్టరేట్లో పీఓ, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. పోలింగ్ ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. సిబ్బందికి పోలింగ్ ప్రక్రియలోని ప్రతి అంశం తెలిసి ఉండాలని, దొంగ ఓట్లు పడకుండా జాగ్రత్తగా
వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. మాస్టర్ ట్రైనర్ హరిప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
48 గంటల నిబంధన తప్పనిసరి
మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు 48 గంటల నిబంధన ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ ముగిసే 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలని.. సభలు, సమావేశాలు, ర్యాలీలు, మీడియా, ప్రసార సాధనాల ద్వారా ఎలాంటి ప్రచారం చేయొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
