- మహిళపై అత్యాచారం, హత్య
- అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు
శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చెట్ల పొదల్లో ఐదు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలం సామ్య తండాకు చెందిన కుట్రోత్ సురేశ్(33) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం విధులు ముగించుకుని నర్సాపూర్‌కు చేరుకున్నాడు. అప్పటికే బస్సు వెళ్లిపోవడంతో సమీపంలోని కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగాడు. ఆ తర్వాత బస్టాండ్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న కొల్చారం మండలం వరిగుంటం గ్రామానికి చెందిన మెట్టు శేకమ్మ(40)తో మాట కలిపి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు.
లైంగిక దాడికి పాల్పడుతుండగా ఆమె ప్రతిఘటించింది. ప్లాస్టిక్ తాడుతో ఆమె చేతులు కట్టేసి, చీర కొంగుతో నోరు మూయడంతో శేకమ్మ మృతిచెందింది. అనంతరం బాధితురాలి రెండు మొబైల్ ఫోన్లు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఐదు రోజుల్లోనే కేసును ఛేదించిన సీఐ రంగకృష్ణ, ఎస్సై రంజిత్ రెడ్డి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
