ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు లోక్ సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ధర్నాపై కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను రాజకీయ అస్త్రంగా వాడుకుంటుందని ఆరోపించారు.
నీట్ పేపర్ లీక్ వివాదానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయకుండా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాన్ ఆరోపించారు.
LoP Shri @RahulGandhi and @INCIndia continue to shamelessly exploit students as political tools to manufacture disruption during the Monsoon Session of Parliament.
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 21, 2026
Shri @RahulGandhi and @INCIndia chose to stage a dharna outside the Hon'ble Prime Minister's residence , causing…
పార్లమెంటులో నీట్ అంశంపై సవివరంగా చర్చించడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు నిరసన చేశారని కేంద్ర మంత్రి ‘X’ పోస్ట్‌లో పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సిగ్గు లేకుండా విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటూనే ఉందని ప్రధాన్ విమర్శించారు.
నీట్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతున్నప్పటికీ, కాంగ్రెస్ 'ప్రజాస్వామ్య చర్చకు బదులుగా రాజకీయ బల ప్రదర్శన'ను ఎంచుకుందని ప్రధాన్ ఆరోపించారు. కాంగ్రెస్ లక్ష్యం విద్యార్థులకు పరిష్కారం చూపించడం కాదని, రాజకీయంగా వార్తల్లోకి ఎక్కడానికే కాంగ్రెస్ చూస్తందని ప్రధాన్ అన్నారు.
ప్రభుత్వం చర్చలకు అవకాశం ఇస్తున్నప్పటికీ రాహుల్ గాంధీ గొడవ సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. నీట్ అంశంపై పార్లమెంటులో చర్చించడానికి, విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన్ అన్నారు.
