పద్మారావునగర్, వెలుగు: ఆషాఢ బోనాల వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో మంగళవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య, 200 మందికి పైగా మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కళాసిగూడలో ఘటోత్సవం
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఘటోత్సవం ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, పోతరాజుల నృత్యాల నడుమ ప్రధాన ఆలయం నుంచి కళాసిగూడలోని అమ్మవారి ఆలయానికి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం రాత్రికి తిరిగా ఉజ్జయిని మహాకాళి ఆలయానికి చేర్చారు. వందలాది మంది భక్తులు పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు.
