- నీట్ పేపర్ లీక్, పోలీసుల లాఠీచార్జ్‌పై చర్చకు డిమాండ్
- విద్యార్థులపై జరిగిన క్రూరత్వంపై సమగ్ర చర్చ జరగాలని నినాదాలు
- నిరసనలతో దద్దరిల్లిన లోక్‌సభ, రాజ్యసభ
న్యూఢిల్లీ, వెలుగు:‘చలో పార్లమెంట్’ మార్చ్‌లో విద్యార్థులు, యువతపై జరిగిన లాఠీచార్జ్ ఘటన రెండో రోజు పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేసింది. నీట్ పేపర్ లీక్‌తో పాటు విద్యా రంగ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనను కేంద్రం అణిచివేసిన తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీచార్జ్‌లపై చర్చించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
దీంతో సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి వచ్చారు. దీంతో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ‘‘లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు సభ్యులకు అవకాశం లభిస్తుంది’’ అని బిర్లా అన్నారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది.
దీంతో సభ ప్రారంభమైన తొమ్మిది నిమిషాల్లోనే మధ్యాహ్నం రెండు గంటలకు ప్యానెల్ స్పీకర్ సంధ్యా రే వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన అనంతరం కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ప్యానెల్ స్పీకర్ దిలీప్ సైకియా రూల్ 377 ప్రకారం సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చొని, సభా కార్యకలాపాలకు సహకరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభను నాలుగు నిమిషాల్లోనే బుధవారానికి వాయిదా వేశారు.
పెద్దల సభలోనూ అదే పట్టు
రాజ్యసభలోనూ విపక్షాలు నీట్ పేపర్ లీక్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థులపై లాఠీచార్జ్ అంశాలపై కేంద్రం స్పందించాలని పట్టుబట్టాయి. దీంతో పెద్దల సభలోనూ వాయిదాల సీన్‌నే కొనసాగింది. సభను చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను వినాలని అన్నారు. “పేపర్ లీక్‌లు, నీట్ పరీక్షపై గళం విప్పుతున్న మన విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించి దాడి చేశారు. వారు ఆసుపత్రుల్లో ఉన్నారు. వారి సమస్యలను వినాలి” అని ఖర్గే అన్నారు.
దీంతో సభలో అధికార పార్టీ సభ్యులు లేచి కేకలు వేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే చైర్మన్ సభను ఏడు నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి ప్రారంభమయ్యాక కూడా ఆందోళన కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. డిప్యూటీ చైర్ హరివంశ్ సింగ్ సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
లోక్‌సభ స్పీకర్‌తో ప్రతిపక్ష నేతల భేటీ
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ప్రతిపక్ష నేతలు భేటీ అయ్యారు. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన తరువాత ఎల్‌ఓపీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్ష ఎంపీలు స్పీకర్‌ను కలిశారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులపై జరిగిన క్రూరత్వంపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
అయితే ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వ అనుమతి కావాలని స్పీకర్ కోరినట్లు వెల్లడించారు. ‘‘సోమవారం విద్యార్థులపై జరిగిన దారుణంపైనా, పరీక్షల సంక్షోభం విషయంలో ప్రభుత్వానికి పూర్తి జవాబుదారీతనం లేకపోవడంపైనా పార్లమెంట్ సమగ్రంగా చర్చించాలి’’ అని అన్నారు. ఈ సమస్యను ప్రతిపక్షం మరుగున పడనివ్వదని, విద్యార్థుల గొంతు వీధుల్లోనూ, పార్లమెంటులోనూ వినిపిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇండియా బ్లాక్ భేటీ
పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా బ్లాక్ భేటీ అయింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ(ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, ఎస్‌పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉభయ సభల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు.
