ఆగస్టు నెలాఖరుకు బీసీ గురుకులాల్లో తనిఖీలు పూర్తి చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

 ఆగస్టు నెలాఖరుకు బీసీ గురుకులాల్లో తనిఖీలు పూర్తి చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
  • అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం
  • ప్రతినెలా 15 విద్యాసంస్థల్లో నేనే ఆకస్మిక తనిఖీలు చేస్తానని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 30వ తేదీలోగా రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో తనిఖీలు పూర్తి చేయాలని  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా కమిషనర్, కార్యదర్శితో కలిసి కనీసం 15 గురుకులాల్లో    స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని వెల్లడించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై  చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనిన్నారు.  బీసీ గురుకులాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమంపై మంగళవారం అధికారులతో మంత్రి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గురుకుల విద్యాసంస్థల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. "ప్రతి రీజినల్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ (ఆర్సీవో) వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి, కనీసం ఆరు గురుకులాలను సందర్శించాలి. అధికారులు కేవలం పరిశీలనకే పరిమితం కాకుండా.. ప్రధాన కార్యాలయం, జిల్లా యంత్రాంగం, విద్యాసంస్థల మధ్య వారధిగా వ్యవహరించి సమన్వయం సాధించాలి. సొంత భవనాలు లేని గురుకులాలకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి.

ఇందుకోసం సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమావేశమై అవసరమైన చర్యలు తీసుకోవాలి" అని ఆదేశించారు. ఏ నియోజకవర్గానికి అనుమతి పొందిన విద్యాసంస్థను అదే నియోజకవర్గ పరిధిలోనే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అద్దె భవనాల కోసం చెల్లించే మొత్తంలో 6 శాతం నిధులను వాటి మరమ్మతులకు వినియోగించాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి విద్యాసంస్థలో 'రెయిన్ వాటర్ హార్వెస్టింగ్' వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.   కాన్ఫరెన్స్ లో బీసీ గురుకుల సెక్రటరీ సైదులు, ఆర్సీవోలు పాల్గొన్నారు.