శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్​పూర్, వెలుగు: బీరంగూడ  భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి సూచించారు. గురువారం సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ నెల14 నుంచి 18 వరకు జరిగే శివరాత్రి జాతరను వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు.

4 లక్షల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సామాన్య భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్  కంట్రోల్  రూమ్  ఏర్పాటు చేసి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఈవో శశిధర్​ను ఆదేశించారు. నిరంతర నిఘా కోసం 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రద్దీ నివారణకు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.

ఆలయం ఆవరణలోని ఆక్రమణలను 24 గంటల్లోగా తొలగించాలని తహసీల్దార్​ వెంకటేశ్ ను ఆదేశించారు. వీఐపీల పేరుతో సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దని, భక్తుల సంఖ్యకు అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జడ్పీ మాజీ వైస్  చైర్మన్ ప్రభాకర్, మున్సిపల్  మాజీ చైర్మన్  పాండురంగారెడ్డి, నేతలు దేవానంద్, సుధాకర్ రెడ్డి, నరసింహ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్  సుధాకర్ యాదవ్  పాల్గొన్నారు.