
మంచు విష్ణు ( Manchu Vishnu ) డ్రిమ్ ప్రాజెక్ట్ పౌరాణిక యాక్షన్ డ్రామా 'కన్నప్ప'. ఈ మూవీ భారీ అంచనాలు, మంచి ఓపెనింగ్స్ తో థియేటర్లలోకి గత వారం ( 27, జూన్ 2025 )న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మంచి టాక్ ను అందుకుంది. అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తారలు అతిథి పాత్రల్లో మెరిసి మెప్పించినా కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోతోంది, ఈ మల్టీస్టారర్ చిత్రం రెండో వారంలోకి అడుగుపెట్టేసరికి వసూళ్ల పరంగా నెమ్మదించింది.
'కన్నప్ప' మొత్తం కలెక్షన్లు
ఈ మల్టీస్టారర్ 'కన్నప్ప' చిత్రం, రెండో వారంలోకి అడుగుపెట్టేసరికి వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. సక్నిల్క్ నివేదిక ప్రకారం, 'కన్నప్ప' తన తొమ్మిదో రోజు, అంటే జూలై 5, 2025 శనివారం నాడు కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది. దీంతో ఇప్పటివరకు సినిమా మొత్తం కలెక్షన్లు 31.13 కోట్ల రూపాయలకు చేరాయి. మొదటి వారం వసూళ్లు 30.2 కోట్లుగా ఉండగా, అందులో సింహభాగం 24.64 కోట్లు తెలుగు వెర్షన్ నుంచే వచ్చాయి. హిందీ వెర్షన్ 3.8 కోట్లు, తమిళం 75 లక్షలు, మలయాళం 73 లక్షలు, కన్నడ 28 లక్షలు వసూలు చేశాయి.
రెండో వారంలో తగ్గిన దూకుడు: బాక్సాఫీస్ గ్రాఫ్ డౌన్!
రెండో వారాంతం ప్రారంభం కాగానే, 'కన్నప్ప' వసూళ్లలో స్పష్టమైన తగ్గుదల కనిపించింది. ఎనిమిదో రోజు (శుక్రవారం) కేవలం 35 లక్షల రూపాయలు రాబట్టగా, శనివారం స్వల్పంగా కోలుకొని 50 లక్షల మార్కును చేరుకుంది. ఇది ప్రారంభ రోజులతో పోలిస్తే వసూళ్లలో గణనీయమైన మందగమనాన్ని సూచిస్తోంది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ ఉన్న చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు కొంత నిరాశపరిచే అంశమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ALSO READ | అఖండ 2' కోసం బోయపాటి శ్రీను భారీ రెమ్యునరేషన్.. సినీ పరిశ్రమలో హాట్ టాపిక్!
ఆక్యుపెన్సీ విషయానికి వస్తే... శనివారం, జూలై 5, 2025న తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆక్యుపెన్సీ రేటు 24.19%గా నమోదైంది. ఉదయం షోలకు 15.90% హాజరు కాగా, మధ్యాహ్నం 22.66%కి పెరిగింది. సాయంత్రం, రాత్రి షోలు వరుసగా 27.61%, 30.59%తో కొంత మెరుగ్గా కనిపించాయి. అయినప్పటికీ, నిలకడైన వసూళ్లకు ఇది సరిపోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన 'కన్నప్ప' చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఈ మూవీలో మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటించగా, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్, ఆర్. శరత్‌కుమార్, మధు, ప్రీతి ముకుందన్, ముఖేష్ రిషి, బ్రహ్మాజీ, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. మరి రాబోయే రోజుల్లో 'కన్నప్ప' టీం తన కలెక్షన్లను ఎలా పెంచుకుంటుందో చూడాలి.