- సీపీ అంబర్ కిశోర్ ఝా
మంచిర్యాల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 59, 60 డివిజన్ల సమస్యాత్మక పోలింగ్ సెంటర్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా డీసీపీ భాస్కర్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్ రావు, ఎస్సైలు ఉన్నారు.
బెల్లంపల్లిలోని పోలింగ్ డిస్ట్రిబూషన్, కౌంటింగ్ కేంద్రం పరిశీలన
బెల్లంపల్లి, వెలుగు: సీపీ అంబర్ కిశోర్ ఝా బెల్లంపల్లిలో పర్యటించారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, నస్పక్షపాతంగా నిర్వహించేందుకు గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. బజార్ ఏరియా హైస్కూల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రూమ్స్, కౌంటింగ్గదులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ ఎ.రవికుమార్, మున్సిపల్ కమిషనర్ జె.సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
నిర్మల్ , వెలుగు: నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో గొడవలకు ఆస్కారం లేకుండా ముందస్తుగా రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా పెట్టి అవసరమైతే బైండోవర్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాజకీయ నేతలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల రూల్స్ పాటించాలన్నారు.
