అభివృద్ధి కొనసాగాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : నీలం మధు

అభివృద్ధి కొనసాగాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి :  నీలం మధు
  • ప్రచారం ప్రారంభించిన నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్​చెరు, వెలుగు: మున్సిపల్  ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని మెదక్  పార్లమెంట్  ఇన్​చార్జి నీలం మధు ముదిరాజ్, నియోజకవర్గ ఇన్​చార్జి కాట శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. గురువారం ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్  అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇద్దరు నేతలు కలిసి ముమ్మరంగా ప్రచారం చేశారు. 15వ వార్డు బచ్చుగూడలో కాంగ్రెస్  అభ్యర్థి సరితను గెలిపించాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్  ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి ఓట్లను అభ్యర్థించారు. పటాన్ చెరు ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోందని చెప్పారు. ఇప్పటికే ఇంద్రేశం మున్సిపాలిటీకి రూ.15 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఆ నిధులతో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.

అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తే అభివృద్ధి మరింత స్పీడప్​ అవుతుందని, చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్  అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వివిధ పార్టీల నేతలు కరుణాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కిష్టారెడ్డి, వెంకట్ రెడ్డితో పాటు మరో 40 మంది కాంగ్రెస్ లో చేరారు. వారికి నీలం మధు, కాట శ్రీనివాస్  గౌడ్  కాంగ్రెస్  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.