క్రిమినల్‌ కేసులను కొట్టేయండి : సీఎం రేవంత్ రెడ్డి

క్రిమినల్‌ కేసులను కొట్టేయండి : సీఎం రేవంత్ రెడ్డి
  •     హైకోర్టులో సీఎం పిటిషన్‌

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసుల్ని కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మొగులపల్లి, భూపాలపల్లి పోలీసు స్టేషన్లలో 2023లో నమోదైన రెండు క్రిమినల్‌ కేసులను కొట్టివేయాలంటూ రెండు పిటిషన్లు వేశారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చేసిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు రేవంత్​పై రెండు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. 

వీటిని కొట్టేయాలంటూ సీఎం వేసిన వ్యాజ్యాలను జస్టిస్‌ కె. సుజన గురువారం విచారించారు. గండ్ర వెంకటరమణారెడ్డి ఒకే ఆరోపణపై కావాలని రెండు ఫిర్యాదులు చేశారని, ఇవి వేధింపుల్లో భాగంగానే చేశారని రేవంత్‌ తరఫు న్యాయవాది వాదించారు. 

దురుద్దేశంతో చేసిన ఫిర్యాదులపై నమోదైన కేసులు కింది కోర్టులో విచారణకు రానున్నాయని ఈ విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించిన హైకోర్టు, ప్రతివాదులైన పోలీసులు, ఫిర్యాదుదారు గండ్రకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. 2023 ఫిబ్రవరి, మార్చిల్లో జరిగిన రెండు బహిరంగ సభల్లో రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ గండ్ర వెంకటరమణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో గండ్ర ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు.