
టాలీవుడ్ యువ హీరో నితిన్ ( Nithiin ) కు బాగా కష్టకాలం ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన నటించిన తాజా చిత్రం 'తమ్ముడు' ( Thammudu ) బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. నితిన్ కు ఇది వరుసుగా నాలుగో ఫ్లాప్ . డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా, అంచనాలను అందుకోలేకపోయింది. ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ పరిణామాలు సినీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. దీనితో ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీలో 'తమ్ముడు' విడుదలపై పడింది.
భారీ డీల్ బోల్తా, నెట్‌ఫ్లిక్స్ సొంతం:
నిజానికి, 'తమ్ముడు' సినిమా ఓటీటీ డీల్ విషయంలో తెర వెనుక పెద్ద డ్రామా నడిచింది. నిర్మాత దిల్‌రాజు, ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime )వీడియోతో భారీ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నారని మొదట వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ డీల్ చివరి నిమిషంలో కుదరలేదు. దాంతో, మేకర్స్ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వైపు మొగ్గు చూపారు. నెట్‌ఫ్లిక్స్ ( Netflix ) మరింత ఎక్కువ ధరను ఆఫర్ చేయడంతో, చివరకు 'తమ్ముడు' డిజిటల్ రైట్స్ ఆ సంస్థ సొంతమయ్యాయి. 'తమ్ముడు' సినిమా సుమారు ₹40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. సినిమా ఫ్లాప్ కావడంతో మేకర్స్‌కు భారీ నష్టాలు వాటిల్లబోతున్నాయి. అయితే, ఓటీటీ హక్కుల ద్వారా బడ్జెట్‌లో కొంత భాగాన్ని తిరిగి రాబట్టుకోగలినట్లు తెలుస్తోంది.
త్వరగానే ఓటీటీలోకి 'తమ్ముడు'!
జూలై 4, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలం కావడంతో, ఇప్పుడు ఓటీటీ విడుదలపైనే దృష్టి సారించారు. సాధారణంగా, పెద్ద తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలైన కనీసం ఒక నెల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. కానీ 'తమ్ముడు' విషయంలో అలా జరగడం లేదు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా నెల రోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. జూలై చివరి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో 'తమ్ముడు' ప్రీమియర్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు త్వరగానే ఈ సినిమాను ఇంట్లో కూర్చుని చూసే అవకాశం ఉంటుంది.
నితిన్ కెరీర్ కు పెద్ద దెబ్బ
'తమ్ముడు' నితిన్ కు వరుసగా నాలుగో ఫ్లాప్ కావడం ఆయన కెరీర్‌కు పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే, ఆయన తన తదుపరి చిత్రమైన యెల్లమ్మ'తో తప్పకుండా కమ్‌బ్యాక్ ఇవ్వాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కూడా దిల్‌రాజు నిర్మిస్తున్నారు. 'యెల్లమ్మ' నితిన్‌కు ఎంత ముఖ్యమో ఈ తాజా పరాజయం మరోసారి స్పష్టం చేసింది. 'తమ్ముడు'మూవీ కథ మొత్తం ప్రధానంగా అన్నాచెల్లెళ్ల బంధం చుట్టూ తిరుగుతుంది. తన చెల్లెలిని రక్షించడానికి నితిన్ పాత్ర ఎంతకైనా తెగిస్తుందనేది ఈ సినిమా కథా నేపథ్యం. మంచి ఎమోషనల్ పాయింట్ ఉన్నా.. ఈ కథా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతో ' కాంతార' ఫేమ్ సప్తమి గౌడ టాలీవుడ్ కు పరిచయమైంది. అటు వర్ష బొల్లమ్మ , లయ కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్ దేవా విలన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. వీరి నటనకు ప్రశంసలు అందుకున్నా.. ఫలితాన్ని మాత్రం ఇవ్వలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బొల్తాపడింది.