
పాట్నా: బీహార్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ రాజుకుంది. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్‌లోని అధికార ఎన్డీఏ కూటమికి కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ బిగ్ షాక్ ఇచ్చాడు. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని కీలక ప్రకటన చేశాడు.
చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు. బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ కూటమి పవర్లో ఉంది. కానీ భాగస్వామ్యపక్షమైన ఎన్డీఏని కాదని.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని చిరాగ్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఆదివారం (జూలై 6) పాశ్వాన్ ఛప్రాలోని రాజేంద్ర స్టేడియంలో జరిగిన ఒక సభలో ఈ ప్రకటన చేశాడు. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించాడు.
బీహార్‌లోని 243 స్థానాల్లో లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థులను నిలబెడతానని స్పష్టం చేశాడు. "బీహార్ ఫస్ట్, బీహారీ ఫస్ట్" అనేదే తన విధానమని పేర్కొన్నాడు. బీహార్ ప్రజల తన ప్రాణాలను పణంగా పెడతానని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. రిజర్వేషన్ల తొలగింపుపై స్పందిస్తూ.. తాను జీవించి ఉన్నంత వరకు ప్రపంచంలోని ఏ శక్తి బీహార్లో రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేయలేదని తేల్చి చెప్పాడు.
బీహార్ ప్రజలు పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు పోకుండా.. రాష్ట్రంలోనే ఉద్యోగాలు సృష్టించగల ప్రభుత్వం అవసరమని, ప్రజలకు తమ సొంత నగరాలు, పట్టణాలు, గ్రామాలలో పని కల్పించాలని అన్నారు. నేర కార్యకలాపాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చిరాగ్ విమర్శలు గుప్పించాడు. కొంతమంది నేను బీహార్‌కు దూరంగా ఉండి కేంద్ర రాజకీయాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారని.. కానీ నేను బీహార్‌కు తిరిగి వస్తున్నానని స్పష్టం చేశాడు.
ఇప్పటికే బీహార్లో అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక ఉంది. ఈ క్రమంలో అధికార కూటమిలోని చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేస్తాననడం ఎన్డీఏ కూటమికి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల అధికార కూటమి ఓటు బ్యాంక్ చీలి ప్రతిపక్షాలకు కలిసి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు బీహార్ పాలిటిక్స్‌లో చర్చ నడుస్తోంది.