
బ్రిటన్: శుభమన్ గిల్ సారథ్యంలోని టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి అతిథ్య ఇంగ్లాండ్‌పై 336 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయం అందుకుంది.
608 పరుగుల భారీ లక్ష్యంతో చేధనకు దిగిన ఇంగ్లాండ్ 271 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 88 పరుగులతో స్మిత్ ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన బ్యాటర్లంతా విఫలం కావడంతో ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్ ఆకాష్ దీప్ ఇంగ్లాండ్‌ను చావు దెబ్బకొట్టాడు. 6 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు.
సిరాజ్, సుందర్, ప్రసిద్ధ్, జడేజా తలో వికెట్ తీశారు. తాజా విజయంతో తొలి టెస్టులో ఓడించిన ఇంగ్లాండ్‌పై భారత్ రివేంజ్ తీర్చుకుంది. ఐదు మ్యాచుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. యువ సారథి గిల్ కెప్టెన్సీలో టీమిండియాకు ఇదే తొలి విజయం. అలాగే బర్మింగ్‌హామ్‌లో కూడా టీమిండియాకు ఇదే తొలి టెస్ట్ విజయం కావడం గమనార్హం.
ఈ మ్యాచులో టీమిండియా ఫస్ట్ ఇన్సింగ్స్‌లో 587 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 407 రన్స్ చేసింది. దీంతో టీమిండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది. సెకండ్ ఇన్సింగ్స్‌లో 426 పరుగులు చేసిన భారత్.. ఫస్ట్ ఇన్సింగ్ 180 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ఇంగ్లాండ్ కు 608 పరుగుల టార్గెట్ విధించింది. 608 రన్స్ చేధనకు దిగిన ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో రెండో టెస్టులో టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
కాగా, వర్షం కారణంగా రెండో టెస్ట్ చివరి రోజు (ఆదివారం) మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కారణంగా ఐదో రోజు ఆటను 80 ఓవర్లకు కుదించారు మ్యాచ్ అఫిషియల్స్. ఓవర్ నైట్ స్కోర్ 77/3తో ఐదు రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది.
వర్షం పడటంతో పిచ్ బౌలర్లకు సహకరించడంతో టీమిండియా బౌలర్ ఆకాష్ దీప్ చెలరేగిపోయాడు. వరుస ఓవర్లలో వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను చావుదెబ్బకొట్టాడు. క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోన్న ఓలీ పోప్‌ను 19 ఓవర్ తొలి బంతికే బౌల్డ్ చేశాడు ఆకాష్ దీప్. తన తర్వాతి ఓవర్లో మరో వికెట్ తీశాడు ఆకాష్ దీప్. ఫస్ట్ ఇన్సింగ్స్ సెంచరీ హీరో హ్యారీ బ్రూక్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
దీంతో 23 పరుగులు చేసి బ్రూక్ పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ స్మిత్‌తో కలిసి ఇన్సింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. స్మిత్, స్టోక్స్ జోడి కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసింది. స్మిత్, స్టాక్స్ పార్టనర్ షిప్‌ను బ్రేక్ చేసేందుకు స్పిన్నర్ సుందర్‌ను రంగంలోకి దింపాడు గిల్. కెప్టెన్ గిల్ నమ్మకాన్ని నిలబెడుతూ స్టోక్స్ (33)ను ఔట్ చేశాడు సుందర్.
అనంతరం సెంచరీ దిశగా సాగుతోన్న స్మిత్ (88)ను ఆకాష్ దీప్ ఔట్ చేయడంతో ఇండియా విజయం ఖరారైంది. చివర్లో కార్సే (38) కాసేపు పోరాడాడు. కార్సేను కూడా ఆకాష్ దీప్ పెవిలియన్ కు పంపడంతో ఎడ్జ్ బాస్టన్లో టీమిండియా చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.