- 2024-25లో రాష్ట్రవ్యాప్తంగా రద్దయింది కేవలం ఒక్కటే లైసెన్స్
- కోర్టులకు ల్యాబ్ రిపోర్ట్‌లు, పక్కా సాక్ష్యాలు సమర్పించట్లే
- దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో వందల్లో కేసులు.. జైలు శిక్షలు
- మన దగ్గర ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల అవినీతితోనే కేసులు బుక్ కావడం లేదనే ఆరోపణలు
హైదరాబాద్, వెలుగు: ఆహార కల్తీ కేసుల్లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కల్తీ చేస్తూ పట్టుబడిన వారిని జైలుకు పంపి, లైసెన్సులు రద్దు చేసే అవకాశం ఉన్నా.. నామమాత్రంగా పెనాల్టీలు వేసి చేతులు దులుపుకొంటున్నారు. శాంపిల్ టెస్టుల్లోనూ ఏడాదికేడాది వెనకబడుతూ వస్తున్నారు. ఇటీవల పార్లమెంట్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ తీరును రాతపూర్వకంగా తెలియజేసింది.
కేంద్ర లెక్కల ప్రకారం.. గత మూడేండ్ల కాలంలో రాష్ట్రంలో వేల ఆహార కల్తీ కేసులు నమోదైనా.. ఒక్కటంటే ఒక్క క్రిమినల్ శిక్ష కూడా పడలేదు. ఇక గతేడాది ఒకే ఒక్క లైసెన్స్ రద్దు చేయడం విడ్డూరం. అయితే, అదే సమయంలో మనరాష్ట్రంతో పోలిస్తే ఇతర రాష్ట్రాలు ఫుడ్ సేఫ్టీ విషయంలో దూకుడుగా ఉన్నట్టు సెంట్రల్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. శిక్షలు వేయడంలో, లైసెన్స్‌లను రద్దు చేయడంలో తెలంగాణతో పోలిస్తే.. పక్కనున్న కర్నాటక, కేరళ, ఏపీ తదితర రాష్ట్రాలు చాలా ముందున్నాయి.
జైలు శిక్షలు జీరో
రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. నాసిరకం ఆహార పదార్థాలను గుర్తిస్తున్నారు.. కానీ, యాక్షన్ తీసుకునే దగ్గరే అసలు మతలబు జరుగుతున్నది. కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో గత మూడేండ్లలో ఒక్క కల్తీ వ్యాపారికి కూడా జైలు శిక్ష పడలేదు.
2022-23లో రాష్ట్రవ్యాప్తంగా 4,809 శాంపిల్స్ టెస్ట్ చేసి, అందులో 315 కేసుల్లో కేవలం ఫైన్లు వేసి వదిలేశారు. క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడినవి సున్నా. 2023-–24లో 6,156 శాంపిల్స్ టెస్ట్ చేయగా 425 కేసుల్లో పెనాల్టీలు విధించారు. ఇక్కడా జైలు శిక్షలు పడలేదు. ఇక 2024–-25లో 3,347 శాంపిల్స్ టెస్ట్ చేసి 125 కేసుల్లో ఫైన్లు వేశారు. శిక్షలు మాత్రం మళ్లీ జీరోనే. ఇది కింది స్థాయి అధికారుల లాలూచీ వ్యవహారానికి అద్దం పడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పక్క రాష్ట్రాల్లో ఉక్కుపాదం...
కల్తీరాయుళ్లను జైలుకు పంపడంలో, లైసెన్సులు రద్దు చేయడంలో ఇతర రాష్ట్రాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తమిళనాడులో 2024–25 ఒక్క ఏడాదే ఏకంగా 492 మందికి జైలు శిక్షలు పడ్డాయి. యూపీలో 215, కేరళలో 206, గుజరాత్‌లో 91 మందిపై ఉక్కుపాదం మోపారు. లైసెన్సుల రద్దులో కేరళ ఆదర్శంగా నిలుస్తున్నది.
కల్తీ చేస్తే షాపులు బంద్ చేస్తూ.. నిరుడు 40 లైసెన్సులు, అంతకుముందు ఏడాది ఏకంగా 137 లైసెన్సులను క్యాన్సిల్ చేసింది. పక్కనున్న కర్నాటక, ఏపీ తదితర రాష్ట్రాల్లోనూ ఏటా పదుల సంఖ్యలో లైసెన్సుల రద్దు జరుగుతుంటే.. మన దగ్గర మాత్రం 2024–-25లో రాష్ట్రం మొత్తంలో రద్దయింది కేవలం ఒక్క లైసెన్స్ మాత్రమే. ఈ లెక్కలు చూస్తే కల్తీ దందా పట్ల అధికారులు ఎంత ఉదాసీనంగా ఉన్నారో అర్థమవుతున్నది.
టెస్టులూ అంతంత మాత్రమే
అధికారులు తీసుకుంటున్న చర్యలే కాదు.. శాంపిల్ టెస్టుల్లోనూ నిర్లక్ష్యం కనిపిస్తున్నది. 2023-–24లో 6 వేల పైచిలుకు శాంపిల్స్‌ను టెస్ట్ చేసిన ఆఫీసర్లు.. 2024–-25 నాటికి ఆ సంఖ్యను 3,300కు తగ్గించేశారు. మన సౌత్ రాష్ట్రాలైన తమిళనాడులో 18,071, కేరళలో 10,767, కర్నాటక 9,371 శాంపిల్ టెస్టులు చేయడం గమనార్హం.
ఇక యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా మనకంటే బెటర్‌గానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు పరిశీలిస్తే మన రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అద్వాన పరిస్థితికి అద్దం పడుతున్నది. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో నాణ్యతా లోపాలు, అడల్టరేషన్ కారణంగా 2024–-25లో ఏకంగా 51 వేల కిలోల ఆహార పదార్థాలను మార్కెట్ నుంచి వెనక్కి రప్పించినట్టు కేంద్రం సభలో వెల్లడించింది. దీనికోసం 754 రీకాల్ నోటీసులు జారీ చేసింది.
అధికారులు విఫలం..
ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే కల్తీకి పాల్పడితే కఠినమైన జైలు శిక్షలు పడేలా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కానీ రాష్ట్రంలో డెసిగ్నేటెడ్ ఆఫీసర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కోర్టులో పక్కా ఆధారాలు సమర్పించడంలో, ల్యాబ్ రిపోర్టులను ప్రాసిక్యూషన్‌కు తగ్గట్టుగా వాడటంలో పూర్తిగా విఫలం అవుతున్నారు. మరోవైపు.. అధికారులు కల్తీ రాయుళ్లతో లాలూచీ పడటంతో కేసులు నీరుగారి పోతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
లంచాల మోజులో ఫుడ్ సేఫ్టీని గాలికి వొదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అధికారులను మ్యానేజ్ చేస్తూ, ఫైన్లు కడితే సరిపోతుంది కదా అనే ధీమాతో కల్తీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మరోవైపు.. ప్రస్తుత ఫుడ్ సేఫ్టీ రూల్స్‌లో లొసుగులను ఆసరాగా చేసుకుని కల్తీ రాయుళ్లు కేవలం ఫైన్లు కట్టి సులభంగా కోర్టుల నుంచి బయటపడుతున్నారని, కఠిన కారాగార శిక్షలు అమలు చేస్తే తప్ప ఈ దందా ఆగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రసాయనాలతో కల్తీ పెరుగు తయారీ.. అంబర్‌పేటలో 2,500 కిలోలు సీజ్
అంబర్పేట్, వెలుగు: హైదరాబాద్ అంబర్‌పేటలో కల్తీ పెరుగు తయారీ దందా గుట్టురట్టయ్యింది. అంబర్పేట్రయ్యత్ నగర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ పెరుగు తయారీ కేంద్రంపై శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో రసాయనాలతో పెరుగు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కాస్టిక్ సోడా, ఎసిటిక్ ఎన్‌హైడ్రైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను పాలలో కలిపి పెరుగు గడ్డకట్టేలా చేస్తున్నారు. పెరుగు తెల్లగా, చిక్కగా కనిపించేందుకు ధర్మో ఫిలిక్ రంగులను, కృత్రిమంగా గడ్డకట్టేందుకు సీహెచ్ఆర్ హన్సేన్ వంటి పౌడర్లను వాడుతున్నారు.
తనిఖీల్లో 2,500 కిలోల కల్తీ పెరుగుతో పాటు 15 కిలోల కాస్టిక్ సోడా, 20 లీటర్ల ఎసిటిక్ ఎన్‌హైడ్రైడ్, సీహెచ్ఆర్ హన్సేన్, ధర్మో ఫిలిక్ కలర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తయారీ అంతా ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఈగలు, దోమల మధ్య అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. నరేశ్, రాఘవేంద్ర అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించామని, ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అరకొర సిబ్బంది.. ఉన్నది ఒక్కటే ల్యాబ్..
అసలు ఈ పరిస్థితికి అధికారుల నిర్లక్ష్యంతోపాటు తీవ్రమైన సిబ్బంది, ల్యాబ్‌ల కొరతే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. దాదాపు 4 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రమంతటికీ నాచారంలో ఒకే ఒక్క ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉన్నది. అందులో మంజూరైన 102 పోస్టుల్లో పనిచేస్తున్నది కేవలం 30 మందే ఉన్నట్టు తెలుస్తున్నది.
ఇక క్షేత్రస్థాయిలో కనీసం 200 నుంచి 300 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉండాల్సిన చోట పదుల సంఖ్యలోనే సిబ్బందితో నెట్టుకొస్తుండగా.. 35 మంది డెసిగ్నేటెడ్ ఆఫీసర్లకుగాను రాష్ట్రవ్యాప్తంగా కేవలం 9 మందే ఉన్నారు. వీరు ఒక్కొక్కరు 3–4 జిల్లాలను పర్యవేక్షించాల్సి వస్తున్నది. తక్షణమే ఈ ఖాళీలు భర్తీ చేసి, కొత్త ల్యాబ్‌లు కట్టి, జైలు శిక్షలు పడేలా కఠిన చట్టాలు అమలు చేస్తేనే కల్తీ మాఫియాకు చెక్ పెట్టొచ్చని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.
పాతబస్తీలో కెమికల్ కలిపి బూజు పట్టిన డ్రై ఫ్రూట్స్ అమ్మకం
ఓల్డ్‌సిటీ, వెలుగు : రసాయనాలు కలిపి బూజు పట్టిన డ్రై ఫ్రూట్స్‌ను నాణ్యమైనవిగా నమ్మించి విక్రయిస్తున్న ఓ వ్యాపారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చార్మినార్ చేలాపురాలో అసవా మనీశ్ (42) జీఈఎం ఫుడ్స్ పేరుతో గోడౌన్ నిర్వహిస్తున్నాడు.
బూజు పట్టి దుర్వాసన వస్తున్న డ్రై ఫ్రూట్స్‌ను సేకరించి కొన్ని కెమికల్స్కలిపి అమ్ముతున్నాడు. విషయం తెలుసుకున్న సిటీ సీసీఎస్ (డీడీ) స్పెషల్ క్రైమ్ టీమ్.. ఫుడ్ అడల్టరేషన్ టీమ్, బహదూర్‌పురా పోలీసులతో కలిసి ష కలిసి గోడౌన్ రెయిడ్ చేపట్టారు. మొత్తం 30 బాక్సుల డ్రై ఫ్రూట్స్ స్వాధీనం చేసుకున్నారు. అసవా మనీశ్ ను అదుపులోకి తీసుకున్నారు.
