14 కొత్త అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడెడ్ వంతెనలు, 3 భారీ బ్యారేజీలు.. మూసీ నది ప్రక్షాళన ఇలా..

14 కొత్త అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడెడ్ వంతెనలు, 3 భారీ బ్యారేజీలు.. మూసీ నది ప్రక్షాళన ఇలా..
  • ఐదు జోన్ల కింద అభివృద్ధి.. గోదావరి నీళ్లతో నిత్య గలగలలు
  • 1.53 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా కట్టలు
  • వందేళ్ల వరద రికార్డులను లెక్కగట్టి.. డిజైన్లు
  • 14 కొత్త అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడెడ్ వంతెనలు, 3 భారీ బ్యారేజీలు
  • చారిత్రక కట్టడాల పరిరక్షణకు ‘వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్’ 
  • ఒకే కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుడి, మసీదు, చర్చి, గురుద్వారా
  • 24x7 నైట్ ఎకానమీ అభివృద్ధి.. భారీగా ఉపాధి అవకాశాలు

హైదరాబాద్, వెలుగు: మురికికూపంలా మారిన మూసీ నదిని హైదరాబాద్‌ సిటీకి తలమానికంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేసింది.  మొత్తం 55 కి.మీ. మేర మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించగా, ఇందులో మొదటి దశ కింద 21 కి.మీ. పరిధిలో రూ.6,500 నుంచి రూ.7 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 

వరద ముప్పును నివారించడం, మురుగునీరు నదిలో కలవకుండా చూడటం, గోదావరి జలాలతో మూసీని నింపడం, నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా ఈస్ట్- వెస్ట్ కారిడార్ నిర్మాణం, బాపుఘాట్ వద్ద భారీ ‘గాంధీ సరోవర్’ ఏర్పాటులాంటి అత్యంత కీలకమైన అంశాలతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నది. ఈ మేరకు మూసీ పునరుజ్జీవనంపై శుక్రవారం మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఎం.డీ నర్సింహారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఇవీ.. 

నాడు జీవనాడి.. నేడు కాలుష్య కాసారం.. 
1591లో కుతుబ్ షాహీల కాలంలో హైదరాబాద్ సిటీ మూసీ నది ఒడ్డునే ఆవిర్భవించింది. దాదాపు 300 ఏం డ్లకు పైగా నగరానికి తాగునీరు,  వ్యవసాయం, వాణిజ్యానికి ఈ నదే ప్రధాన ఆధారం. అనంతగిరి కొండల్లో పుట్టే మూసీ నది 240 కి.మీ. ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఇందులో 55 కిలోమీటర్లు హైదరాబాద్‌లో ప్రవహిస్తుంది. అయితే, ప్రస్తుతం మూసీ పరిస్థితి దయనీయంగా మారింది. 

బఫర్ జోన్లలో ఆక్రమణలు, ఘనవ్యర్థాల డంపింగ్, 27 ప్రధాన నాలాల నుంచి నిత్యం ట్రీట్‌మెంట్‌ చేయని మురుగునీరు నదిలో కలుస్తుండటంతో నది కుంచించుకుపోయింది. దీనివల్ల 2020లో వచ్చిన వరదలకు 50 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యికి పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. రూ.5 వేల కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లింది. 2050 నాటికి ఆకస్మిక వరదలు 40 % పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరి స్తున్న నేపథ్యంలో.. మూసీ ప్రక్షాళన ఆప్షన్ కాదు, అత్యవసరమని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది.

ప్రపంచ నగరాల స్ఫూర్తితో మూసీ ప్రక్షాళన.. 
దక్షిణ కొరియాలోని సియోల్ (చియోంగ్‌గైచియాన్), లండన్ (థేమ్స్ నది), టోక్యో (సుమిదా నది), సింగపూర్ రివర్ ఫ్రంట్, పారిస్ (సీన్ నది), అహ్మదాబాద్ (సబర్మతి) తరహాలో మూసీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆయా దేశాల్లో కాలుష్య నదులను ప్రక్షాళన చేసి.. ఆర్థిక, పర్యాటక ఇంజిన్లుగా ఎలా మార్చారో స్టడీ చేసింది. హైదరాబాద్‌ను బ్లూ అండ్ గ్రీన్ సిటీగా మార్చడం, హెరిటేజ్ టూరిజం, నైట్ ఎకానమీ (24x7) అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

55 కిలో మీటర్ల మాస్టర్ ప్లాన్.. తొలిదశకు రూ.7 వేల కోట్లు
మూసీ అభివృద్ధి కోసం సింగపూర్‌కు చెందిన మైన్‌హార్డ్, ఆర్‌ఐఓఎస్, కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ కన్సార్టియం ను అగ్రిగేట్ మాస్టర్ ప్లానర్‌గా ప్రభుత్వం నియమించిం ది. బ్లూ (నీరు), గ్రీన్ (పర్యావరణం), ల్యాండ్ యూజ్, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రణాళికలు వీరు సిద్ధం చేస్తారు. మొత్తం 55 కిలోమీటర్ల ప్లాన్‌లో భాగంగా.. తొలిదశ (ఫేజ్-1) కింద గండిపేట, రాజేంద్రనగర్ నుం చి గాంధీ సరోవర్ (బాపు ఘాట్) వరకు 21 కిలోమీటర్ల మేర పనులు చేపడతారు. ఇందుకు రూ.6,500 నుంచి రూ.7వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. నదిలో పూడికతీత, నది గర్భం ప్రొఫైలింగ్, వరద నివారణ గోడలు, మురుగు కాలువల నిర్మాణం, రోడ్లు, రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ పనులు ఇందులో ఉంటాయి.

వరద ముప్పు తప్పేలా పకడ్బందీ అధ్యయనం
నది పరీవాహక ప్రాంతాలైన ఉస్మాన్ సాగర్ (740 చదరపు కి.మీ.), హిమాయత్ సాగర్ (1,362  చదరపు కి.మీ.) సహా కింది స్థాయి నాలాల (890 చదరపు కి.మీ.) ద్వారా వచ్చే వరదను లెక్కించారు. వందేండ్ల లో ఎన్నడూ లేనంతగా 1.53 లక్షల క్యూసెక్కుల (హిమాయత్ సాగర్), 26,300 క్యూసెక్కుల (ఉస్మాన్ సాగర్) వరద వచ్చినా తట్టుకునేలా నదికి ఇరువైపులా కరకట్టలు, డిజైన్లను సిద్ధం చేశారు. దీనిని రూర్కీలోని జాతీయ జల విజ్ఞాన సంస్థ కూడా ఆమోదించింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం బఫర్ జోన్లలో పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు, నడక దారులు మాత్రమే నిర్మిస్తారు.

ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఈస్ట్-వెస్ట్ కారిడార్
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మూసీ వెంబడి ‘ఈస్ట్-వెస్ట్ కారిడార్’ను నిర్మించనున్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు సుమారు 43 కి.మీ. మేర నిర్మించే ఈ మార్గం ద్వారా కేవలం 45 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. దీనివల్ల ప్రయాణ సమయం 50 శాతం ఆదా అవ్వడంతోపాటు ఓఆర్ఆర్ , నగర రోడ్లపై ట్రాఫిక్ భారం తగ్గుతుంది.  

మతసామరస్యం.. వారసత్వ సంపదకు పెద్దపీట
కుతుబ్ షాహీ సమాధులు, గోల్కొండ కోట, తారామతి బారాదరి, చార్మినార్, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టులాంటి చారిత్రక కట్టడాలను కలుపుతూ హెరిటేజ్ టూరిజంను అభివృద్ధి చేయనున్నారు. నది వెంబడి మతసామరస్యానికి ప్రతీకగా.. ఒకే కారిడార్‌లో టెంపు ల్ (మంచిరేవుల), మసీదు (పురానాపూల్), గురుద్వారా (గౌలిగూడ), చర్చి (నాగోల్)లను కొత్తగా నిర్మించాలని ప్రతిపాదించారు.

ప్రజల సలహాలు, సూచనలు కోరుతున్నం 
ఈ ప్రాజెక్టు కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదని, సర్కారు భావి స్తున్నది. ఈ విజన్‌ను వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు ప్రజలు తమ విలువైన సలహాలు, సూచనలను https://musi.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా పంచుకోవాలని ప్రభుత్వం కోరుతున్నది. ‘‘రేపటి హైదరాబాద్‌ను.. ఈరోజే నిర్మిద్దాం’’ అనే నినాదంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నది.

బాపుఘాట్ వద్ద భారీ ‘గాంధీ సరోవర్’
మూసా, ఈసా నదులు కలిసే పవిత్ర సంగమ ప్రదేశం, 1948లో మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన 'బాపు ఘాట్' వద్ద అద్భుతమైన ‘గాంధీ సరోవర్’ను నిర్మించనున్నారు. ఇక్కడ ఎత్తైన పీస్ స్టాచ్యూ (శాంతి విగ్రహం), నేషనల్ మ్యూజియం, చేనేత శిక్షణా కేంద్రం, మెడిటేషన్ -వెల్‌నెస్ విలేజ్, నాలెడ్జ్ హబ్‌లను మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచారు. ఇది నగరంలోనే ఒక గొప్ప పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మారనున్నది.

మురుగుకు చెక్.. గోదావరి జలాలతో కళకళ
మూసీలోకి చుక్క మురుగునీరు కూడా వెళ్లకుండా నదికి ఇరువైపులా ట్రంక్ సివరేజ్ లైన్లను నిర్మించను న్నారు. ఇప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న (అమృత్ పథకం కింద 972 ఎంఎల్డీ ) ఎస్టీపీల ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. ట్రీట్ చేసిన (గ్రే వాటర్) నీటిని పచ్చద నం పెంచడానికి, డేటా సెంటర్ల కూలింగ్ కోసం వాడతారు. గోదావరి నది నుంచి 20 టీఎంసీల నీటిని తరలించే ప్రాజెక్టు ద్వారా 17.5 టీఎంసీలను సిటీ తాగునీటికి, మిగిలిన 2.5 టీఎంసీలను మూసీలో ఎల్లప్పుడూ ప్రవహించేందుకు కేటాయిస్తారు.