శంషాబాద్‌లో 150 ఎకరాల్లో ఇంటర్నేషనల్ బస్ టర్మినల్ నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో భేటీ అయిన సీఎం, సంస్థ పురోభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కార్మికుల పట్టుదల వల్లే ఆర్టీసీ దేశంలోనే నెంబర్ వన్ సంస్థగా నిలిచిందని సీఎం కొనియాడారు. కేవలం ప్రశంసలతోనే ఆగిపోకుండా.. సంస్థ భవిష్యత్తు కోసం భారీ ప్రణాళికలను ప్రకటించారు. ఏటా డీజిల్ కోసం పెడుతున్న 2 వేల కోట్ల ఖర్చును తగ్గించేందుకు వెయ్యి కొత్త ఈవీ బస్సులను కొనుగోలు చేయబోతున్నట్లు సీఎం తెలిపారు. వీటిని మెట్రోతో అనుసంధానం చేయడమే కాకుండా, మినీ బస్సులను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.ఆర్టీసీలో ఉన్న బకాయిలు మా హయాంలో వచ్చినవి కావు.. కానీ వాటిని క్లియర్ చేసే బాధ్యత మాదే అని సీఎం భరోసా ఇచ్చారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టామని తాజాగా ఉద్యోగుల కోసం వెయ్యి కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేశామని ప్రకటించారు.
ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు.
మహాలక్ష్మి పథకం - ఆర్థిక చేయూత
మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే 8 వేల కోట్ల రూపాయలను ఆర్టీసీకి అందించామని.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కార్మికుల హక్కులను కాపాడుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.సంస్థ ఆగిపోతే ఊపిరి పోయినట్లే.. రాజకీయాలకు అతీతంగా సంస్థను కాపాడుకోవాలి. ఒక్క డ్రైవర్‌ను కూడా తొలగించే ప్రసక్తే లేదు అని సీఎం హామీ ఇచ్చారు. యూనియన్లు, విలీనం వంటి అంశాలపై కార్మిక సంఘాలే చర్చించుకుని స్పష్టమైన ప్రణాళికతో రావాలని సూచించారు. కార్మికులు, యాజమాన్యం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని.. ఆర్టీసీ సమస్యలను వంద శాతం పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు.
