వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

వైభవంగా  లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం కొండపై ఉన్న వేంకటగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు రమాకాంత్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు స్వామి-అమ్మవార్ల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానం తరఫున చైర్మన్ నరసింహమూర్తి స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారు అమ్మవారి మెడలో మంగళసూత్రం కట్టే తంతు ఘనంగా జరిగింది.

 ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలేరు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.