యాదగిరిగుట్ట ట్రస్ట్‌‌ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

యాదగిరిగుట్ట ట్రస్ట్‌‌ బోర్డు ఏర్పాటుపై  ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి  లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటులో నిబంధనల అమలుకు సంబంధించి ప్రభుత్వంతోపాటు కొత్త ట్రస్టు బోర్డు చైర్మన్‌‌, సభ్యులకూ మంగళవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రతివాదులైన దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఆలయ ఈవో, చైర్మన్‌‌ ఎం. సత్యనారాయణరెడ్డితోపాటు సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్‌‌ చైర్మన్, ప్రధాన అర్చకులకు నోటీసులు ఇచ్చింది.

 ట్రస్ట్‌‌ బోర్డు ఏర్పాటు నిమిత్తం దేవాదాయశాఖ చట్ట సవరణను, బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 392ను సవాలు చేస్తూ నాగిళ్ల శ్రీనివాస్‌‌తోపాటు వ్యవస్థాపక ట్రస్టీ భాస్కరయాణి నరసింహమూర్తి హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. దీనిని చీఫ్‌‌ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జీఎం మొహియుద్దీన్‌‌తో కూడిన బెంచ్‌‌ మంగళవారం విచారణ చేపట్టింది.

 పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ట్రస్టు బోర్డు ఏర్పాటుకు అవకాశం ఇచ్చేందుకు వీలుగా దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని సవరిస్తూ అదనంగా సెక్షన్‌‌ 96, 97లను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. చట్టసవరణలో భాగంగా ప్రభుత్వం గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌లో రూ.100 కోట్ల ఆదాయం ఉన్న ఆలయాలకు ట్రస్ట్‌‌బోర్డు ఏర్పాటు చేయవచ్చని పేర్కొందన్నారు. అంతేగాకుండా ప్రస్తుత ట్రస్ట్‌‌బోర్డులో వంశ పారంపర్య ధర్మకర్తను సాధారణ సభ్యుడిగా నియమించడం పన్నాలాల్‌‌ బన్సీలాల్‌‌ పిట్టి వర్సెస్‌‌ ఏపీ కేసులో సుప్రీం కోర్టు వెలువరించిన మార్గదర్శకాలకు విరుద్ధమని చెప్పారు. 

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వంశపారంపర్య ధర్మకర్తలకు ప్రత్యేక స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అలాకాకుండా ప్రస్తుత ట్రస్టు బోర్డులో వంశపారంపర్య ధర్మకర్తను సాధారణ సభ్యుడిగా నియమించడం సరి కాదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 24, 25 ప్రకారం ఆలయ బోర్డులో ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వకూడదని వివరించారు. ఆలయ నిత్య కైంకర్యాలు, పూజావిధానాలు, ఉత్సవాలు, ఆగమ సంప్రదాయాల నిర్వహణ వంటి అత్యంత కీలక బాధ్యతలను అప్పగించిందన్నారు.

 ఇవి కేవలం పరిపాలనాపరమైన అంశాలేకాకుండా మతపరమైనవని, అందువల్ల ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంతో హిందూ మత సంస్థలకు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తి దెబ్బతింటోందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు