మంగపేట, వెలుగు : హేమాచల లక్ష్మీనృసింహస్వామి తిరుకల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూజారులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులు బృందం ఆధ్వర్యంలో లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు కల్యాణం జరిపించారు. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తీసుకువచ్చారు. అనంతరం వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. గోదావరి పుష్కరాల లోపు భద్రాచలం నుంచి ఏటూనాగారం వరకు రోడ్డు డెవలప్మెంట్, మంగపేట, చుంచుపల్లి, మల్లూరు పుష్కర ఘాట్లు గోదావరికి అటువైపుగా ఉన్న వాజేడు, వెంకటాపురంలోని పుష్కర ఘాట్లను పూర్తి చేస్తామని, ఈ బెల్ట్ లో ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు.
అనంతరం మంత్రి మండల పరిధిలోని కమలాపురంలో అంతర్గత రోడ్లు, సీసీ రోడ్లతోపాటు మంగపేటలోని గంపనిగూడెం ఆర్అండ్బీ రోడ్డు నుంచి బస్టాండ్ వరకు సెంట్రల్ లైటింగ్, రోడ్డు వైండింగ్పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఏటునాగారం ఏఎస్పీ మనన్ బట్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కల్యాణి, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
