హైదరాబాద్: రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని.. అలాగే, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామని తెలిపారు. శుక్రవారం (మే 1) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని కార్మిక సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
కార్మిక సంఘాల నేతల అభ్యర్థనపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సమ్మె కాలానికి 3 రోజుల వేతనం ఇచ్చేందుకు, కేసుల ఎత్తివేతకు అంగీకరించారు. ఈ మేరకు సమ్మె కాలంలో వేతనం, కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపించినందుకు సీఎంకి ధన్యవాదాలు తెలిపారు కార్మిక సంఘాల ప్రతినిధులు.
డిమాండ్ల పరిష్కారం కోసం ఇటీవల తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు సమ్మె చేశారు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపింది. చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు.
