మూసీ పునరుజ్జీవం.. రాష్ట్రానికి గ్రోత్‌‌‌‌ ఇంజన్‌‌‌‌: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

మూసీ పునరుజ్జీవం..  రాష్ట్రానికి గ్రోత్‌‌‌‌ ఇంజన్‌‌‌‌: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి
  • విషతుల్యంగా మారిన నదిని పర్యావరణహితంగా మారుద్దాం
  • పేదవాళ్లను నిరాశ్రయులను చేయడం మా ఉద్దేశం కాదు..
  • వారికి మెరుగైన జీవనం అందించాలనేదే మా లక్ష్యం
  • మన సంస్కృతి, చరిత్ర పరిరక్షణకు మూసీని కాపాడుకోవాలి
  • మానవ తప్పిదాలతో నల్గొండ జిల్లా ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి?
  • పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన వాళ్లే  ప్రక్షాళనను అడ్డుకుంటున్నరు
  • కాంగ్రెస్‌‌‌‌కు, రేవంత్‌‌‌‌కు మంచి పేరు వస్తుందనే అడ్డంకులు సృష్టిస్తున్నరు
  • రేవంత్‌‌‌‌రెడ్డి మూసీ చుట్టూ రియల్​ ఎస్టేట్ ​చేస్తున్నడని ఆరోపిస్తున్నరు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేంటి? 
  • కంటైనర్ ఇస్తా.. మురికిలో మూడు నెలలు ఉంటారా?
  • సూచనలు చేయండి.. అభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌‌‌‌గా మూసీ పునరుజ్జీవం చేపడుతున్నామని, భవిష్యత్తు తరాల కోసమే ఈ బృహత్తర ప్రక్షాళన అని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. పేదవాళ్లను నిరాశ్రయులను చేయడం తమ ఉద్దేశం కాదని, వారికి మెరుగైన జీవనం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విషతుల్యంగా మారిన నదిని పర్యావరణ హితంగా మారుద్దామని పిలుపునిచ్చారు. శుక్రవారం మూసీ రివర్‌‌‌‌ఫ్రంట్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (ఎంఆర్‌‌‌‌డీసీఎల్‌‌‌‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మూసీ ఇన్వైట్స్‌‌‌‌’ కార్యక్రమంలో  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి వెల్లడించారు. మన సంస్కృతిని, చరిత్రను కాపాడుకోవాలంటే మూసీని రక్షించుకోవాల్సిందేనని, కొందరి తప్పిదాలకు నల్గొండ ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలని  ప్రశ్నించారు. 

పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన వాళ్లే నేడు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. కాంగ్రెస్‌‌‌‌కు, రేవంత్‌‌‌‌రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న అక్కసుతోనే ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని  దుయ్యబట్టారు.  మూసీ చుట్టూ తాను రియల్ ఎస్టేట్ చేస్తున్నానని కొందరు ఆరోపిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేంటని నిలదీశారు. ప్రాజెక్టులో తప్పులుంటే సలహాలు, సూచనలు చేయాలి కానీ, నగరాభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రతిపక్షాలకు సీఎం హితవు పలికారు.

కూలంకషంగా చర్చించి ప్రణాళికలు
మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రక్షాళన కార్యక్రమాన్ని సమాజానికి వివరించేందుకే మేధావులు, ప్రముఖులతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.  చరిత్రను గమనిస్తే ప్రపంచంలో నాగరికత, ఆర్థిక వ్యవస్థలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. ‘‘నేను లండన్‌లో థేమ్స్ నది, న్యూయార్క్‌లో హడ్సన్ నదితో పాటు సియోల్, సింగపూర్, దుబాయ్‌లాంటి నగరాల్లో పర్యటించి.. అక్కడి అభివృద్ధిని అధ్యయనం చేశా” అని తెలిపారు. 

అభివృద్ధి చెందిన దేశాలు వేగంగా ముందుకు వెళ్తుంటే, మనం అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతే భవిష్యత్ తరాలు క్షమించవన్న ఉద్దేశంతోనే ఈ కార్యానికి శ్రీకారం చుట్టామన్నారు. గత రెండేండ్లుగా నిరంతరం ఎంతోమంది నిపుణులు, ఆర్థిక, పర్యావరణ సలహాదారులతో కూలంకషంగా చర్చించి మూసీ పునరుజ్జీవన ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. 

కుతుబ్‌షాహీలు, నిజాంలు, బ్రిటిషర్లు హైదరాబాద్‌ను నిర్మిస్తే, చంద్రబాబు, వైఎస్సార్ సైబరాబాద్‌ను నిర్మించారని, ఇప్పుడు నగరం ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిందని ఆయన అన్నారు. ఒక కోటి 34 లక్షల జనాభా ఉన్న ఈ నగరానికి మౌలిక వసతులు, తాగునీరు, పరిశ్రమల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని చెప్పారు.

నిజాం రాజుల పనులను ఆదర్శంగా తీసుకోవాలి..
నిజాం ప్రభువుల పాలనపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, వారు చేసిన గొప్ప పనులను ఆదర్శంగా తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘‘ 1908లో మూసీ వరదలు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నప్పుడు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నిజాం రాజు పిలిపించి వరద నియంత్రణకు అద్భుత ప్రణాళికలు రచించారు. 104 ఏండ్ల క్రితం నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు నేటికీ చెక్కుచెదరకుండా హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. కేవలం నీటి కోసమే కాకుండా చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రిలాంటి గొప్ప వారసత్వ కట్టడాలను నిజాం నదీ పరీవాహక ప్రాంతంలోనే అందించారు. ప్రపంచంలోని ప్రతి వస్తువు దొరికేలా చార్మినార్ చుట్టూ ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్‌ను ఆనాడే నిజాం విజువలైజ్ చేసి సృష్టించారు. 

ఇంత గొప్ప చరిత్ర, గుర్తింపు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఇలాగే కలుషితంగా వదిలేయకుండా పర్యావరణ మార్పులకు తగ్గట్టుగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదేండ్లు, పన్నెండేళ్లు అధికారంలో ఉండి నగరాన్ని గ్లోబల్ మ్యాప్‌లో పెట్టామని చెప్పుకునే వారు, ఇప్పుడు మూసీ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారు?’’ అని ప్రతిపక్షాలనుద్దేశించి అన్నారు.  తప్పులుంటే సూచనలు ఇవ్వాలని, వాటిని అమలు చేయడానికి తాను అక్కడే ఉన్నానని, కానీ అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవడం సరికాదని సీఎం స్పష్టం చేశారు.

పారదర్శకంగా గ్లోబల్‌ టెండర్లు..
అంతర్జాతీయ కన్సల్టెంట్లను ఎంపిక చేయడానికి గ్లోబ ల్ టెండర్లు పిలిచి పారదర్శకంగా వ్యవహరించామని సీఎం రేవంత్‌ వివరించారు. 2050 నాటికి నగర జనా భా 2 కోట్ల 80 లక్షలకు చేరుకుంటుందని, వారికి జవా బుదారీగా ఉంటూ మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. 

‘‘గత ప్రభుత్వాలు ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు, హైటెక్ సిటీ లాంటివి తేకపోయి ఉంటే నేడు మన ఆర్థిక వ్యవస్థ ఇంతలా బాగుపడేదా? 1994 నుంచి 2024 వరకు గత పాలకులు తీసుకున్న మంచి విధానాలన్నింటినీ తమ ప్రభుత్వం కూడా ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా కొనసాగిస్తుంది. నాకు ఒక అగ్రెసివ్ లీడర్‌గా ఉన్న ఇమేజ్‌ను మార్చుకొని, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుంటూ సీఎంగా నా వర్కింగ్ స్టైల్ మార్చుకున్నాను” అని వెల్లడించారు. 

ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతోమంది సీఎంలుగా పనిచేసినా, చరిత్రకు అవసరమైన నిర్ణయాలు తీసుకున్నవారే ప్రజల మదిలో ఎప్పటికీ నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. పాతబస్తీలో మెట్రో రైలు, రోడ్ల విస్తరణ కోసం మురికి కూపం నుంచి బయటపడేందుకు అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా ఎలా ముందుకు వచ్చారో అందరికీ తెలిసిందేనన్నారు. మూసీ ప్రాజెక్టు ఉద్దేశం ఎవరికో నష్టం కలిగించడం కాదని, మారుతున్న కాలంతో పాటు ప్రపంచంతో పోటీపడేలా నగరాన్ని తీర్చిదిద్దడమేనని  స్పష్టం చేశారు.

మూసీతో నల్గొండ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు..
మూసీ నదిలో కాలుష్యం కారణంగా కింద ఉన్న నల్గొం డ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ఫార్మా కంపెనీల కాలుష్యం, డ్రైనేజీలు, పశువుల కళేబరాలతో మూసీ ఒక విషతుల్యంగా మారి నల్గొండ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నదని వివరించారు. 

ప్రకృతి ఒకవైపు ఫ్లోరైడ్ రూపంలో నల్గొండను శిక్షిస్తుంటే, మనం మానవ తప్పిదాలతో మూసీ కాలుష్యం ద్వారా వారిని మరింత శిక్షించడం ధర్మమా? అని ప్రశ్నించారు. మూసీ నదిలో గోదావరి జలాలను కలిపి, ప్రవాహాన్ని స్థిరీకరించి కాలుష్యాన్ని పారదోలాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ప్రక్షాళనను అడ్డుకుంటున్న నాయకులు కనీ సం 3 నెలలు మూసీ ఒడ్డున కంటైనర్లలో బతికితే అక్కడి పేదలు పడే కష్టాలు అర్థమవుతాయని అన్నారు. 

చెరువులను పునరుద్ధరిస్తే ప్రజలు సంతోషిస్తున్నరు..
 చెరువులను పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేసినప్పుడు, స్థానికులు బ్రహ్మరథం పట్టారని, స్థానిక స్వయం సహాయక సంఘాల ఆర్థిక వ్యవస్థ కూడా బలపడిందని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. ఎవరైతే ఇండ్లు కోల్పోతున్నారో వారికి 10,500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించామని, ఉపాధి కోల్పోకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నామని తెలిపారు.

ఒవైసీ, ఇతర నేతల సూచనల మేరకు పాతబస్తీ, అంబర్‌పేటలాంటి ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లోనే పేదలకు ఇండ్లు, బడులు, ఆస్పత్రులు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మూసీ సుందరీకరణ కోసం రక్షణ శాఖ అధికారులు కూడా ముందుకు వచ్చి వంద ఎకరాల భూమిని బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ నిర్మాణానికి ఇచ్చేందుకు అంగీకరించారని సంతోషం వ్యక్తం చేశారు. మూసీ చుట్టూ 100 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేసి, ఇరువైపులా రోడ్లు, వాణిజ్య సముదాయాలతో గొప్ప ఎకనామిక్ జోన్ నిర్మిస్తామని  ప్రకటించారు.

ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం..
మూసీ ప్రాజెక్టు వ్యయంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచా రం చేస్తున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. మొత్తం 21 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.6,500 నుంచి రూ.7వేల కోట్లు ఖర్చవుతుంటే, అందులో గాంధీ సరోవర్‌‌కు కేవలం రూ.200 కోట్లు అవుతుందని వివరించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మూసీ వెంట ఎలివేటెడ్ కారిడార్లు, ప్రతి జంక్షన్‌లో ట్రంపెట్లు నిర్మించి.. నగరం నలుమూలలకు కనెక్టివిటీ పెంచుతామని వివరించారు. కలుషిత నీటిని ట్రీట్ చేసి డేటా సెంటర్లకు, పరిశ్రమలకు అతి తక్కువ ధరకు అందించడం ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. 

తద్వారా రాష్ట్రాన్ని అద్భుతమైన గ్రోత్ ఇంజన్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని, ఇది ఏ పేదవాడి ఆస్తులు లాక్కోవడానికి కాదని తేల్చిచెప్పారు. గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తెచ్చి అందులో రెండున్నర టీఎంసీలను మూసీలో నిరంతరం ప్రవహించేలా చేసి, మిగతా 17.5 టీఎంసీలను నగర ప్రజల దాహార్తికి వాడతామని వివరించారు.

‘‘జలశక్తి మినిస్ట్రీ, సెంట్రల్ వాటర్ కమిషన్ తెచ్చిన కఠిన చట్టాలను అమలు చేస్తుంటే, పార్లమెంట్‌లో బల్లలు చరిచి చట్టం చేసిన బీజేపీ నేతలే ఇక్కడ అడ్డుపడటం విచిత్రం గా ఉంది. లోక కల్యాణం కోసం మునులు యజ్ఞాలు చేస్తుంటే మారీచుడు, సుబాహుడులాంటి రాక్షసులు రక్తం, మాంసం వేసి అడ్డుకున్నట్టు.. ప్రతిపక్షాలు నేడు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. మంచి పనులకు సహకరించకపోయినా.. ఇలా రాక్షసుల్లా అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలి”అని సీఎం విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీలో ఓపెన్‌ డిబేట్‌..
మూసీ పునరుజ్జీవనంపై శాసనసభలో ఓపెన్ డిబేట్ పెడతామని, ప్రతిపక్షాలు అక్కడికి వచ్చి తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్‌ కోరారు. పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వనని, వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు తన ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు దేవుడు తెలంగాణ రెండో సీఎంగా గొప్ప అవకాశం ఇచ్చాడని, దాన్ని వృథా చేసుకోనని చెప్పారు. 

కర్మ సిద్ధాంతాన్ని నమ్మే పక్కా హిందువుగా మంచిని మంచిగా, చెడును చెడుగా నిలదీస్తూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తానని స్పష్టం చేశారు. మూసీ అభివృద్ధి ఒకరితో అయ్యేది కాదని, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి నగరాన్ని, రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. చార్మినార్ చుట్టూ ఒకనాడు నిజాం సర్కార్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో ముత్యాలు, గాజులు, కబూతర్ ఖానాలో పక్షు లు, మొజంజాహీ మార్కెట్లో ప్రపంచంలోని పండ్లు లభించేవని సీఎం తెలిపారు. 

ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తం
శంషాబాద్ ఎయిర్ పోర్టు కట్టినప్పుడు ఎంతోమంది భూములు కోల్పోయారని, వారిని అప్పట్లో ప్రభుత్వం సానుభూతితో ఆదుకుందని సీఎం రేవంత్‌ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా మూసీ నిర్వాసితులైన పేదలకు అన్యాయం జరగకుండా అంబర్‌పేటలోని పోలీస్ అకాడమీకి చెందిన 150 ఎకరాల్లో 25 ఎకరాలను కేటా యించి.. అక్కడే ఇండ్లు, బడులు కట్టిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన ఆందోళన సంఘాలకు హామీ ఇచ్చారని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే బలాల, ఒవైసీ సోదరుల విజ్ఞప్తి మేరకు పేదలకు ఉపాధి పోకుండా ఆయా నియోజకవర్గాల్లోని ప్రభుత్వ భూముల్లోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు. 

అంబేద్కర్ విగ్రహానికి గత ప్రభుత్వం 420 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు తాము వ్యతిరేకించలేదని, ఇప్పుడు బాపుఘాట్ వద్ద గాంధీ విగ్రహానికి కేవలం 70 నుంచి 75 కోట్లు పెడుతుంటే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. తాను ప్రభుత్వ బడిలో చదివిన మధ్యతరగతి వ్యక్తినని, ప్రపంచంలోని ప్రాజెక్టులను చూసి నేర్చుకునే కామన్ సెన్స్ తనకుందన్నారు. తాను పెద్ద సైంటిస్టును కాకపోయినా ‘సీయింగ్ ఈజ్ బిలీవింగ్’ అన్న సూత్రా న్ని నమ్ముతానని, ఎవరెన్ని సృష్టించినా కల్పించినా మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని తేల్చి చెప్పారు.