- మొజ్తబా గాయపడ్డారు.. కానీ ప్రాణాలతోనే ఉన్నారని కామెంట్
- కోమాలో ఉన్నారంటూ మీడియాలో కథనాలు
- మొజ్తబా ఆచూకీ చెప్తే రూ.92 కోట్లు ఇస్తామని యూఎస్ ప్రకటన
- రష్యా ఆయిల్ పై 30 రోజులు ఆంక్షల సడలింపు
- హార్మూజ్లో ప్రయాణానికి నౌకలు ధైర్యం చేయాలని పిలుపు
- అమెరికా వార్ షిప్ లింకన్ పై మిసైల్స్ తో అటాక్ చేశాం: ఇరాన్
- దాడి జరగలేదంటూ ఫొటోలు రిలీజ్ చేసిన అమెరికా
- ఇరాక్‌లో అమెరికా రీఫ్యూయల్ ప్లేన్ క్రాష్ .. ఆరుగురు మృతి
- టెహ్రాన్‌లో నిరసనల ప్రదేశం వద్ద ఇజ్రాయెల్ దాడి
టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వచ్చే వారం ఇరాన్‌పై అత్యంత కఠినమైన, శక్తివంతమైన దాడులు చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం ఫాక్స్ న్యూస్ రేడియో ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు.
యుద్ధం మూడో వారంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఆయన ఈ మేరకు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "వచ్చే వారం మేం వారిని (ఇరాన్‌ను) చాలా గట్టిగా కొట్టబోతున్నాం" అని స్పష్టం చేశారు. ఇక శుక్రవారం 14వ రోజున కూడా ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేయగా.. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపైకి మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడింది.
మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ బాంబుదాడిలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ బాంబు దాడిలో మొజ్తబా కాలు తెగిపోయిందని, పొట్ట, కాలేయం భాగాల్లో బలమైన గాయాలు అయ్యాయని వార్తలు ప్రసారమయ్యాయి. దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవైపు ఇరాన్ దాడిలో దుబాయ్ సెంట్ర ల్ లోభారీ పేలుడు సంభవించగా.. ఇజ్రాయెల్ బాంబు దాడితో టెహ్రాన్‌లో వేలాది మంది కుద్స్ డే నిరసన ప్రదర్శన చేస్తున్న ప్రాంతం దద్దరిల్లింది.
ఒమన్‌లోని సోహార్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్ లో అమెరికా రీఫ్యూయలింగ్ ప్లేన్ కూలిపోవడంతో అందులోని ఆరుగురు సిబ్బంది చనిపోయారు. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఐదుగురు పిల్లలతో సహా 15 మంది మరణించారు. ఈ దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాలను, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమేనని ఖతార్ విదేశాంగ శాఖ మండిపడింది.
రష్యన్ ఆయిల్పై ఆంక్షల సడలింపు..
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రస్తుత పరిస్థితిపైనా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. "అతను (మొజ్తబా) బహుశా ప్రాణాలతోనే ఉండవచ్చు. కొంత గాయపడి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రూపంలో అతను సజీవంగానే ఉన్నాడని నేను నమ్ముతున్నా" అని అన్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొజ్తబా బహిరంగంగా కనిపించకపోవడంతో వస్తున్న సందేహాల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
కాగా, యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చమురు ధరలను అదుపు చేసేందుకు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షలు ఉన్నప్పటికీ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి 30 రోజుల పాటు పాక్షిక మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.
హార్మూజ్లో ధైర్యం చూపాలి..
హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల విషయంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నౌకలు కొంత ధైర్యాన్ని ప్రదర్శించి తమ ప్రయాణాన్ని కొనసాగించాలి. భయపడాల్సిన పనిలేదు. ఇరాన్ నౌకలన్నింటినీ మేం ముంచేశాం" అని ఆయన పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు అమెరికా నౌకాదళం రక్షణ కల్పిస్తుందా? అనే అంశంపై స్పందిస్తూ.. "అవసరమైతే మేము ఆ పని చేస్తాం. కానీ, అంతా సజావుగా సాగుతుందని ఆశిస్తున్నా" అని చెప్పారు. జీ7 దేశాల నేతలతో జరిగిన వర్చువల్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రస్తుతం "లొంగిపోయే స్థితిలో" ఉందన్నారు.
'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ద్వారా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీశామని, మనందరినీ భయపెడుతున్న ఒక "క్యాన్సర్"ను వదిలించుకున్నామని చెప్పారు. కాగా, ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.."వారు (ఇరాన్ నేతలు) గత 47 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు. ఇప్పుడు అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఉన్న నేను, వారిని అంతం చేస్తున్నాను. అలా చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను" అని ట్రంప్ పేర్కొన్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇంధన సంక్షోభం
హార్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు పెరిగింది. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28తో పోలిస్తే ధరలు 40% పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతోంది. మరోవైపు, ఇరాన్ సౌదీ అరేబియా, యూఏఈలోని చమురు నిల్వ కేంద్రాలు, పౌర మౌలిక సదుపాయాలపై కూడా దాడులు చేస్తోంది. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
టెహ్రాన్‌లో భారీ పేలుడు
ఇరాన్ రాజధానిలో శుక్రవారం జరిగిన వార్షిక 'కుద్స్ డే' ప్రదర్శనలో భారీ పేలుడు సంభవించింది. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి "అమెరికా నశించాలి", "ఇజ్రాయెల్ నశించాలి" అని నినాదాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తుతున్న ఫిర్దోసి స్క్వేర్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. దాడికి కొద్దిసేపటి ముందు ఇజ్రాయెల్ సైన్యం పర్షియన్ భాషలో సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని హెచ్చరించింది.
ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ గులాం హుస్సేన్ మొహ్సేని టీవీ ఇంటర్వ్యూ ఇస్తుండగా ఈ పేలుడు సంభవించింది. కాగా, ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం.. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 1,444 మంది చనిపోగా, 18,551 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, అమెరికా విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌పై తాము బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశామని, ఆ నౌక ధ్వంసమైందని ఇరాన్ ప్రకటించింది. అయితే, దీనిని అమెరికా సెంట్రల్ కమాండ్ తోసిపుచ్చింది. అబ్రహం లింకన్ నౌక సముద్రంలో సురక్షితంగా ఉన్న ఫోటోను విడుదల చేసింది.
దుబాయ్ సెంట్రల్పై డ్రోన్ అటాక్
దుబాయ్ సెంట్రల్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించడంతో రావడంతో భవనాలు కంపించాయి. పేలుడు ధాటికి మంటలు ఎగిసిపడి, ఆకాశంలో పొగ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే, దుబాయ్ ఆర్థిక కేంద్రం లక్ష్యంగా వచ్చిన క్షిపణి లేదా డ్రోన్‌ను గాలిలోనే పేల్చేసినట్టు అధికారులు ధృవీకరించారు. ఈ దాడిలో క్షిపణి శకలాలు పడటంతో ఒక భవనం పాక్షికంగా దెబ్బతింది.
గురువారం కూడా దుబాయ్‌లోని అల్ బదా ప్రాంతం, షేక్ జాయెద్ రోడ్డుపై డ్రోన్ శకలాలు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో యూఏఈ సైన్యం 10 బాలిస్టిక్ క్షిపణులను, 26 డ్రోన్లను కూల్చివేసింది. కాగా, బహ్రెయిన్ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంకులపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున బహ్రెయిన్ అంతటా ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఎదురు దాడి
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన పొరుగు దేశాలలోని చమురు మౌలిక సదుపాయాలపై డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ పంపిన సుమారు 50 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ ప్రకటించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (డీఐఎఫ్సీ) వద్ద కూల్చివేసిన క్షిపణి శకలాలు పడి భవనాలు దెబ్బతిన్నాయి.
సోహార్ పారిశ్రామిక ప్రాంతంలో రెండు డ్రోన్లు కూలి ఇద్దరు భారతీయులు మరణించారు. తుర్కియేలో నాటో రక్షణ వ్యవస్థలు ఇరాన్ నుంచి వచ్చిన ఒక బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నాయి. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్ లక్ష్యంగా లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా శుక్రవారం తీవ్రస్థాయిలో రాకెట్ దాడులు చేసింది. కాగా, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు చేసిన దాడులు కేవలం "ప్రారంభం మాత్రమే" అని హెచ్చరించారు.
