
లక్ష్యాన్ని సాధించాలంటే ఎంతో కృషి, ఎన్నో త్యాగాలు చేయాలని రాజ్ సింగ్ బలంగా నమ్మాడు. అందుకే తన కార్పొరేట్ కెరీర్‌ని వదులుకుని ఆవుల పెంపకం మొదలుపెట్టాడు. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో కరోనా వచ్చి, కోలుకోలేని దెబ్బతీసింది. అప్పటివరకు సంపాదించింది అంతా పోయింది. అయినా నమ్మకం కోల్పోకుండా దృఢ సంకల్పంతో ఒక స్టార్టప్ పెట్టి మరోప్రయత్నం చేశాడు. ఈ సారి మాత్రం అతని సక్సెస్‌ని ఏదీ ఆపలేకపోయింది. ఆ స్టార్టప్ ఇప్పుడు ఏటా రెండున్నర కోట్లు సంపాదించే వెంచర్‌గా ఎదిగింది.
రాజ్ చిన్నప్పటినుంచి బాగా కష్టపడి చదివేవాడు. చదువు పూర్తయ్యాక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. కానీ.. అతనిలో మాత్రం ఎంట్రపెన్యూర్‌గా ఎదగాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. అందుకే ఏండ్ల పాటు చేసిన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. ఆ తర్వాత తన సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు వెళ్లిపోయాడు. రాజ్‌కు తక్కువ టైంలో సక్సెస్ కావాలంటే డెయిరీ రంగమే సరైన మార్గం అనిపించింది. దాంతో 2017లో ఏడెకరాలు లీజుకు తీసుకుని, అందులో ఆవుల షెడ్డు నిర్మించాడు. 40 ఆవులతో మొదలైన పాల వ్యాపారం 250 ఆవులకు విస్తరించింది. అంతలోనే కరోనా మహమ్మారి విపరీతమైన నష్టాలను తెచ్చిపెట్టింది. ఆవుల పోషణ, పాలను కస్టమర్లకు చేర్చడం చాలా ఇబ్బందిగా మారింది. లాక్‌డౌన్‌ల వల్ల సప్లై చైన్ దెబ్బతిన్నది. దానికితోడు మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువై ఆర్థిక భారం విపరీతంగా పెరిగింది. దాంతో ఆవులను అమ్మేశాడు. కానీ.. చివరి రోజుల్లో నెలకు దాదాపు రూ. 60 లక్షల వరకు నష్టం వచ్చింది.
అవకాశాలను వెతుక్కుంటూ..
డెయిరీ బిజినెస్ మానేసిన తర్వాత రాజ్ ముందున్న ఏకైక మార్గం ఉద్యోగం. కానీ.. అతను మళ్లీ జాబ్‌లో చేరేందుకు ఇష్టపడలేదు. కొత్త మార్గాల కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. అతనికి ఆవుల షెడ్డు ఉన్నప్పుడు పేడను చాలా తక్కువ ధరకు అమ్మేవాడు. అలా తక్కువకు అమ్మే బదులు తానే కంపోస్ట్ తయారుచేస్తే బాగుండేది అనుకున్నాడు. కానీ.. అప్పట్లో కుదర్లేదు. అదే ఆలోచన మళ్లీ వచ్చింది. దాంతో వర్మీ కంపోస్టింగ్ పద్ధతిపై పూర్తిగా రీసెర్చ్ చేశాడు. ఆ తర్వాత పేడ కొని, కంపోస్టింగ్ చేయడం మొదలుపెట్టాడు. సాధారణ ఆవు పేడను చాలా విలువైన ఎరువుగా మార్చాడు. అప్పులతో బాధపడుతున్న రాజ్‌లో ఈ బిజినెస్ కొత్త ఆశలను నింపింది. దాంతో అమ్మకాలు కాస్త పెరగగానే ‘గ్రోయింగ్ ట్రీ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ పెట్టాడు.
ధర తక్కువ.. క్వాలిటీ ఎక్కువ
వ్యాపారంలోకి దిగిన కొన్ని రోజుల్లోనే.. కంపోస్ట్ ఎరువులు ఎక్కువగా కొనేది చిన్న తరహా రైతులే అని అర్థం చేసుకున్నాడు రాజ్. అందుకే అలాంటి వాళ్లకు అందుబాటులో ఉండేలా సప్లై చైన్‌ని నిర్మించాడు. ఇతర కంపెనీల కంటే చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చాడు. కొన్నిసార్లు రూ. 3కే కిలో ఎరువు అమ్మాడు. అలా కస్టమర్ల సంఖ్యను పెంచుకున్నాడు. తక్కువ ధరకు అమ్మినా రాజ్ తయారుచేసే వర్మీ కంపోస్ట్ చాలా క్వాలిటీగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని బలియాకు చెందిన ఆనంద్ ప్రకాష్ అనే రైతు వెల్లుల్లి, ఉల్లిపాయలు, మిరప పండిస్తున్నాడు. ‘‘సేంద్రియ సాగు చేయాలనే ఉద్దేశంతో స్థానికంగా దొరికే కంపోస్ట్‌ని వాడాను. కానీ.. అనుకున్నంత ఫలితాలు రాలేదు. తెగుళ్లను నివారించడానికి మళ్లీ రసాయన పురుగుమందులు వాడాల్సి వచ్చింది. అప్పుడే యూట్యూబ్ ద్వారా రాజ్ సింగ్ తయారుచేసే కంపోస్ట్ గురించి తెలుసుకున్నా. ఈ కంపోస్ట్ ఉపయోగించినప్పటి నుంచి పంట దిగుబడి బాగా పెరిగింది. ఎకరాకి 6 నుంచి7 క్వింటాళ్ల వర్మీ కంపోస్ట్ వేస్తున్న. కిలోకు రూ. 4 పెట్టి కొంటున్నా. గతంలో నేను ఉపయోగించిన ఎరువుల కంటే ఇవి చాలా చవక” అంటున్నాడు మూడేళ్లుగా రాజ్ దగ్గర కంపోస్ట్ కొంటున్న ఆనంద్. రాజ్ స్థానిక డెయిరీల నుంచి పేడను సేకరిస్తున్నాడు. అమ్మకాలు మాత్రం ఉత్తరప్రదేశ్ దాటి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్‌కు విస్తరించాయి. బెంగళూరు, పూణే లాంటి ప్రధాన నగరాల్లో కూడా ఈ మధ్యే అమ్మకాలు మొదలయ్యాయి.
►ALSO READ | తమిళ చెఫ్కు న్యూయార్క్ అవార్డు
ఎన్నో ఎదురుదెబ్బలు
‘‘నేను 2008లో ఆటోమోటివ్ మేనేజ్‌మెంట్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశా. మార్కెటింగ్‌లో ఎంబీఏ కూడా చేశా. ఆ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించా. కానీ.. ఆ కార్పొరేట్ వాతావరణంలో ఉండలేకపోయా. మాది వ్యవసాయ కుటుంబం కావడంతో దానికి సంబంధించిన స్టార్టప్ ఏదైనా పెట్టాలని నిర్ణయించుకున్నా. అలా పాల వ్యాపారం పెట్టి నష్టపోయా. తర్వాత సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసేవాళ్ల సంఖ్య పెరగడం గమనించా. అలాంటి సాగుకు అవసరమయ్యే వర్మీ కంపోస్ట్‌కి కూడా డిమాండ్ బాగా పెరుగుతోంది. అందుకే ఈ స్టార్టప్ పెట్టా” అంటూ తన జర్నీని చెప్పుకొచ్చాడు రాజ్.
అరటి ఆకులతో
వర్మీకంపోస్ట్‌ని తయారుచేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన విధానాన్ని ఎంచుకున్నాడు రాజ్. మల్చింగ్ కోసం అరటి ఆకులను ఉపయోగిస్తున్నాడు. అంటే ఆవు పేడ కుప్పలపై మూడు నుంచి ఐదు అంగుళాల మందంగా అరటి ఆకులతో కప్పేస్తాడు. ఆకుల పొర కంపోస్ట్ పైన తేనెగూడు లాంటి నిర్మాణాన్ని సృష్టిస్తుంది. అరటి ఆకుల వాడకం వల్ల ప్లాస్టిక్ షీట్లు, ఇటుకలు, కాంక్రీట్ బెడ్స్ లాంటి ఖరీదైన వస్తువుల అవసరం లేకుండా పోయింది. పైగా అరటి ఆకుల వల్ల పూర్తిగా చీకటి ఏర్పడుతుంది. మాయిశ్చర్ కంట్రోల్‌లో ఉంటుంది. వేసవిలో టెంపరేచర్లు 45డిగ్రీలు ఉన్నా ఈ అరటి ఆకుల కింద ఉండే వర్మీ కంపోస్ట్ బెడ్‌ల ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించదు. దీనివల్ల వానపాముల సంఖ్య పెరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి 90 రోజులు టైం పడుతుంది. ప్రస్తుతం రాజ్500 వర్మీ కంపోస్ట్ బెడ్స్‌ని మెయింటెయిన్ చేస్తున్నాడు. ఒక్కోదాంట్లో రెండు టన్నుల కంటే ఎక్కువ కంపోస్ట్ తయారవుతుంది. ప్రతి నెలా 500 టన్నుల వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి అవుతుంది. సీజన్‌ని బట్టి కిలోకు రూ. 4.5 వరకు అమ్ముతున్నాడు. దీని ద్వారా ఏటా రూ. 2.5 కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఇప్పుడు వర్మీ కంపోస్ట్ తయారీపై ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడు. అంతేకాదు.. రాజ్‌సింగ్ చుట్టుపక్కల రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నాడు.