హైదరాబాద్లో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లులక్ష కట్టించిండు : మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్లో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లులక్ష కట్టించిండు : మాజీ మంత్రి హరీశ్ రావు
  • మళ్లీ కేసీఆరే సీఎం అవుతరు: మాజీ మంత్రి హరీశ్ రావు
  • ప్రజల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేవని ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్​లో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కడితే.. రేవంత్ రెడ్డి లక్ష ఇండ్లను కూల్చారని విమర్శించారు. ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. కేబినెట్ మీటింగ్​లో సీఎం, మంత్రులు తిట్టుకున్నారని ఆరోపించారు. 

కాంగ్రెస్​కు ప్రజల మేలు పట్టడంలేదని, వాటాలు పంచుకోవడానికే సరిపోతున్నదని విమర్శించారు. తెలంగాణ భవన్​లో వడ్డెర సంఘం ప్రతినిధులు, ఎంబీబీఎస్ సీట్లు సాధించిన మైనారిటీ గురుకుల విద్యార్థులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​తో కలిసి ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ పాలనే కోరుకుంటున్నారని అన్నారు. 

ఇక తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమే అని.. కేసీఆరే సీఎం అవుతారని తెలిపారు. ‘‘పేదల ఇండ్లు కూల్చొద్దన్నా.. హైడ్రా బంద్ కావాలన్నా.. జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​ను ఓడగొట్టాలి. వడ్డెర అంటే బండజాతి.. మొండిజాతి.. మాట తప్పని జాతి .. గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేసి మైనారిటీలకు కేసీఆర్ నాణ్యమైన విద్య అందించారు’’అని హరీశ్ రావు అన్నారు. మైనారిటీ గురుకులాల్లో చదివి ఎంబీబీఎస్ సీట్లు సాధించడం గర్వించదగిన విషయమన్నారు.

కాంగ్రెస్ కాకమ్మ కథలు నమ్మలే: కేటీఆర్​

హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ చెప్పిన కాకమ్మ కథలు నమ్మలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో బీఆర్ఎస్​నే గెలిపించారని కేటీఆర్ అన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ ఒక్క మంచి పని కూడా చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రజలను మరోసారి కాంగ్రెస్​ మోసం చేయబోతున్నదని మండిపడ్డారు. ‘‘రెండేండ్ల కింద కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినా.. అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. 

ఆ ఎమ్మెల్యే కనీసం ప్రజలకూ కనిపించడం లేదు. వడ్డెర సామాజికవర్గానికి రాజకీయ ప్రాతినిథ్యం పెరిగేలా కేసీఆర్​తో మాట్లాడి కృషి చేస్తా. కేసీఆర్ ఎప్పుడూ కులం, మతం పేరుతో రాజకీయాలు చేయలేదు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. కేసీఆరే సీఎం అవుతారు. జహీరాబాద్ మైనారిటీ గురుకులలో చదువుకున్న 16 మంది స్టూడెంట్లకు ఎంబీబీఎస్ సీట్లు రావడం సంతోషంగా ఉంది’’అని కేటీఆర్ అన్నారు.