హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన చాదర్ ఘాట్ కాల్పుల ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. మొబైల్ స్నాచర్ దాడిలో గాయపడి సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య, గన్ మెన్‌ను ఆదివారం (అక్టోబర్ 26) డీజీపీ పరామర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ చైతన్య హెల్త్ స్టేటస్ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. సెల్ ఫోన్ స్నాచింగ్‌కి పాల్పడిన దొంగలను పట్టుకునే క్రమంలో వాళ్లు పోలీసులపై తిరగబడ్డారని తెలిపారు.
సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య, ఆయన గన్ మెన్‌పై నిందితులు కత్తితో దాడి చేసి పారిపోబోయారని.. వెంటనే అప్రమత్తమైన డీసీపీ చైతన్య నిందితులపై కాల్పులు జరిపాడని తెలిపారు. డీసీపీ కాల్పుల్లో ఒమర్ అన్సారీ అనే నిందితుడు గాయపడ్డాడని చెప్పారు. నిందితుడు ఒమర్ అన్సారీపై 22 కేసులు ఉన్నాయని.. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో అతడిపై రౌడీ షీట్ఉందని తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో ధైర్యసాహసాలు కనబరిచిన డీసీపీ, గన్ మెన్ ఆర్యోగ్య పరిస్థితి తెలుసుకున్నానని.. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఇద్దరు అధికారులు సోమవారం (అక్టోబర్ 27) డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. నిందితుడు ఒమర్ అన్సారీకి కూడా ఆపరేషన్ జరిగిందని.. అతడి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని తెలిపారు. పరారీలో ఉన్న నేరస్థుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
కాగా, హైదరాబాద్ చాదర్ ఘట్లోని విక్టోరియా గ్రౌండ్లో శనివారం (అక్టోబర్ 25) కాల్పులు కలకలం సృష్టించాయి. తనపై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగలపై సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలవ్వగా నాంపల్లి ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే..?
సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించారు డీసీపీ చైతన్య. ఈ క్రమంలో డీసీపీ చైతన్య మీద కత్తితో దాడికి యత్నంచారు దొంగలు. దీంతో స్వయంగా డీసీపీ చైతన్య దొంగలపై కాల్పులు జరిపారు. ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో డీసీపీ చైతన్య గన్ మెన్ కింద పడిపోయారు. దీంతో గన్ మెన్ వెపన్ తీసుకొని దొంగపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు డీసీపీ.
ఈ ఘటనలో ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలవ్వగా వెంటనే.. నాంపల్లి ఆస్పత్రికి తరలించారు. దొంగకు ఛాతికి, మెడకు గాయాలైనట్టు తెలుస్తోంది. డీసీపీ చైతన్య గన్ మెన్ కాలికి స్వల్పంగా గాయాలయ్యాయి. డీసీపీతో పాటు మిగతా పోలీస్ సిబ్బంది క్షేమంగా ఉన్నారు. దొంగ పాత నేరస్థుడేనని..అతనిపై కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.
