టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడుల్లో వరుసగా ఇరాన్ అగ్ర నాయకులు మరణిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించగా.. తాజాగా ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అబ్దుల్‌రహీం మౌసావి చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఆయన మరణించారని ప్రకటించింది.
ది మ్యాన్ ఫర్ డిఫికల్ట్ మిషన్స్ అని పేరున్న మౌసావి 2025లో మొహమ్మద్ బాఘేరి హత్య తర్వాత ఇరాన్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ సైన్యానికి దశాబ్దాలుగా సేవలందించిన మౌసావి అంచెలంచెలుగా ఎదిగారు. ఆర్మీ నార్త్ఈస్ట్రన్ కమాండ్ చీఫ్‌గా వ్యవహరించారు. అలాగే, ఇమామ్ అలీ మిలిటరీ విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించాడు.
ఆ తరువాత 2017లో ఆర్మీ కమాండర్-ఇన్-చీఫ్‌గా ప్రమోట్ అయ్యాడు. అనంతరం 2025లో ఇరాన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అత్యంత నమ్మకస్తుల్లో అబ్దుల్‌రహీం మౌసావి ఒకరు. 2026, ఫిబ్రవరి 28న ఖమేనీతో మౌసావి ఓ కీలకమైన మీటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో ఖమేనీతో పాటు మౌసావి కూడా చనిపోయాడు.
