భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం సీతారాముల మూలవరులకు పంచామృతాలతో అభిషేకం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించాక మూలవరులకు ముందుగా మంజీరాలు అద్ది, తర్వాత ఆవుపాలు, నెయ్యి, పెరుగు, తేనె, పంచదారలతో అభిషేకం చేసి, చివరిగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. తర్వాత మూలవరులను సుందరంగా అలంకరించి బంగారు పుష్పాలతో అర్చనను నిర్వహించారు. ఈ ఆర్జిత సేవలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం, వీకెండ్ కావడంతో భక్తులతో రద్దీగా ఆలయం మారింది. కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం నిర్వహించగా 40 జంటలు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నాయి. కల్యాణం అనంతరం మాధ్యాహ్నిక ఆరాధనలు నిర్వహించి రాజబోగం నివేదించారు.
కార్తీక మాసం సందర్భంగా భక్తుల కోసం దేవస్థానం సత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించింది. చిత్రకూట మండపంలో 12 జంటలు ఈ వ్రతాలను చేయించుకున్నారు. సాయంత్రం సీతారామచంద్రస్వామికి బేడా మండపంలో దర్బారు సేవను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
