సింగరేణి స్టోర్ చోరీ కేసులో.. ఇల్లెందు ఎస్ఈ ఆనందరావుపై వేటు

సింగరేణి స్టోర్ చోరీ కేసులో.. ఇల్లెందు ఎస్ఈ ఆనందరావుపై వేటు
  • మరో ఆఫీసర్​ అంజిరెడ్డిపై కొనసాగుతున్న విచారణ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రెండేండ్ల కింద సింగరేణి స్టోర్​లో జరిగిన చోరీకి బాధ్యుడిని చేస్తూ సింగరేణి ఇల్లెందు ఏరియాలో ఎస్ఈగా పని చేస్తున్న ఆనందరావును కంపల్సరీ రిటైర్​మెంట్​ స్కీంలో భాగంగా ఉద్యోగానికి రిజైన్​ చేయాలని యాజమాన్యం ఆదేశించింది. ఈ మేరకు యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్​ అంజిరెడ్డిపై విచారణ చేపట్టింది.

రెండేండ్ల కింద స్టోర్​లో రూ.8 లక్షల విలువైన కాపర్​ చోరీకి గురైనట్లు ఆఫీసర్లు గుర్తించారు. కాగా, రూ. 25 లక్షలకు పైగానే కాపర్​ దొంగతనం జరిగిందనే ప్రచారం జరిగింది. చాలా ఎత్తులో ఉండే స్టోర్​ పైకప్పు రేకులు తొలిగించి కాపర్​ చోరీ చేయడం అప్పట్లో కలకలం రేపింది. 

సింగరేణి ఎస్అండ్​పీసీ విభాగానికి చెందిన స్పెషల్​ టీమ్స్​తో పాటు సెక్యూరిటీ పక్కాగా ఉన్న ఈ స్టోర్​లో దొంగతనం జరగడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై సింగరేణి విజిలెన్స్​ అధికారులతో పాటు యాజమాన్యం విచారణ నిర్వహించి సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్న ముగ్గురు జమేదార్లకు ఇంక్రిమెంట్లను కట్​ చేసింది. స్టోర్​లో పని చేస్తున్న అప్పటి ఎస్ఈ ఆనందరావును సీఆర్ఎస్​లో వెళ్లిపోవాలని ఆదేశించింది. సెక్యూరిటీ ఆఫీసర్​ అంజిరెడ్డిపై విచారణ కొనసాగుతోంది.