బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ బాక్సాఫీస్ సునామీకి రంగం సిద్ధమైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతున్నట్లు కనిపిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్ ఊచకోత!
విడుదలకు ముందే ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఇప్పటి వరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 1.5 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. బుధవవారం సాయంత్రం ( మార్చి 17, 2026 ) పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ. 37.11 కోట్లు, మొదటి రోజు షోల ద్వారా రూ. 22.70 కోట్లు కలిపి.. అప్పుడే భారత్‌లో రూ. 60 కోట్ల మార్కును దాటేసింది. ఓవర్సీస్‌లో కూడా రణవీర్ క్రేజ్ మామూలుగా లేదు. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 4 మిలియన్ల డాలర్లు వసూళ్లు సాధించి షారుఖ్ ఖాన్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల రికార్డులను సవాలు చేస్తోంది.
మరో 'యానిమల్' తరహా రన్‌టైమ్..!
ఈ సినిమా రన్‌టైమ్ విషయంలో ఆదిత్య ధర్ పెద్ద సాహసమే చేశారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'A' (Adults Only) సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక నిడివి విషయానికి వస్తే, ఏకంగా 3 గంటల 49 నిమిషాల (229 నిమిషాలు) భారీ రన్‌టైమ్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంత సుదీర్ఘమైన యాక్షన్ ఎపిక్ ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ముంబై వంటి నగరాల్లో క్రేజ్‌ను తట్టుకోవడానికి తెల్లవారుజామున 2 గంటలకే షోలు ప్లాన్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
భారీ అంచనాలు
2025లో విడుదలైన 'ధురంధర్' మొదటి భాగం రూ. 1300 కోట్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. అండర్ కవర్ ఏజెంట్ 'జస్కీరత్ సింగ్ రంగీ'గా రణవీర్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. పాకిస్థాన్ లో కూడా అభిమానులు ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పార్ట్-2లో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు తోడవడంతో సినిమా స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. వీరితో పాటు రాకేష్ బేడీ, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
►ALSO READ | Kangana Ranaut : 'బాలీవుడ్‌కు సిగ్గు లేదు'.. నోరా ఫతేహి అశ్లీల పాటపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు!
జియో స్టూడియోస్ , బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం ప్రాణం పోశారు. బుధవారం సాయంత్రం నుండే ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండటంతో, మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం సునాయాసంగా దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే వీకెండ్ బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలి!
