వాషింగ్టన్: ఇరాన్ నుంచి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన్ హార్మూ్జ్ జల సంధిని రక్షించేందుకు యుద్ధం నౌకలు పంపాలన్న తన పిలుపును నాటో దేశాలు పట్టించుకోకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నాటో దేశాల అవసరం లేదని.. తామే చూసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ట్రంప్ ఒక ప్రకటన చేశారు.
‘‘హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ను అడ్డుకోవడానికి యుద్ధ నౌకలు పంపేందుకు నాటో సహా చాలా మిత్రదేశాలు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయని సమాచారం అందింది. ఈ విషయంలో నాటో కూటమి తీరు ఏకపక్షంగా ఉంది. అమెరికా తన మిత్రదేశాలను రక్షించడానికి భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ వారు మాత్రం మా కోసం ఏమి చేయరు’’ అని నాటో కూటమిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ విషయంలో అమెరికా ఒంటరిగా ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తమ దేశానికి నాటో, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటి ఇతర ప్రధాన భాగస్వాముల నుంచి ఎలాంటి సహాయం అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా బలగాలు ఇరాన్ సైనిక సామర్థ్యాలను గణనీయంగా దెబ్బ తీశాయని పేర్కొన్నారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, మిస్సైల్ తయారీ రంగంతో సహా రక్షణ వ్యవస్థలోని కీలక అంశాలు నాశనం అయ్యాయని తెలిపారు.
►ALSO READ | ఇరాన్ తప్పేమి లేదు.. మొత్తం ట్రంపే చేశాడు: US ఇంటలిజెన్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. కాదు కూడదని ముందుకెళ్లే నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కొన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక పిలుపునిచ్చారు.
హార్మూజ్ జల సంధిలో చమురు నౌకలను కాపాడుకునేందుకు ఆయా దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపునిచ్చారు. హర్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలను మోహరించాలని కోరారు. ఇరాన్ నుంచి హార్మూజ్ జల సంధికి స్వేచ్ఛ కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే.. ట్రంప్ పిలుపుకు ఆశించిన స్పందన రాలేదు. నాటో కూటమి సహా అమెరికా మిత్ర దేశాలు హార్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలు మోహరించేందుకు నిరాకరించాయి.
