పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని బసంత్ నగర్ బస్టాండ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన దంపతులు మృతి చెందారు. మంగళవారం ( మార్చి 17 ) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఎడ్ల శ్రీనివాస్, రజితల కూతురు రిషిత హైదరాబాద్ లో చదువుకుంటోంది. కూతురు రిషితను చూసేందుకు హైదరాబాద్ వెళ్లారు దంపతులు. హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా కారు కల్వర్టును ఢీకొనడంతో శ్రీనివాస్, రజిత మృతి చెందారు.
హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా.. బసంత్ నగర్ బస్టాండ్ దగ్గర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. కూతురిని చూసుకొని.. బాగోగులు చెప్పి ఇంటికి సంతోషంగా తిరిగొస్తున్న సమయంలో కల్వర్టు రూపంలో శ్రీనివాస్, రజితను మృత్యువు కబళించింది. భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
