రాష్ట్రంలో సోమవారం సాయంత్రం పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో మోస్తరు వర్షం పడింది. దీంతో చేతికందిన పంటలు నేలవాలిపోయాయి. హైదరాబాద్ నగరంలోనూ చిరుజల్లులు పడ్డాయి. రాష్ట్రంలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పల్వట్లలో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 2.8, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 2.5 చొప్పున వర్షం పడింది. రాష్ట్రవ్యాప్తంగా మరో వారం రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వడగండ్లు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అకాల వర్షాలు మొదలయ్యాయి. సోమవారం సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్లకు తోడు మోస్తరు వర్షం పడింది. దీంతో చేతికంది వచ్చిన పంటలు నేలవాలిపోయాయి. మరో వైపు హైదరాబాద్ నగరంలోనూ చిరుజల్లులు పడ్డాయి. రాష్ట్రంలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పల్వట్లలో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 2.8, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 2.5, మానూరులో 2, మెదక్ జిల్లా శివంపేటలో 1.8, కామారెడ్డి జిల్లా సోమూరులో 1.5, పాతరాజంపేటలో 1.3 సెంటమీటర్ల చొప్పున వర్షం పడింది. హైదరాబాద్ సిటీలో సాయంత్రం ఆరు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలిదుమారంతో పాటు పలుచోట్ల ఈదురుగాలులు
వీచాయి.
వారం రోజులు వానలు..
రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వడగండ్లు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ముఖ్యంగా బుధ, గురువారాల్లో వర్షాల తీవ్రత, వడగండ్ల ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలోనూ వారం రోజుల పాటు సాయంత్రం వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
