కొణిజర్ల, వెలుగు: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు (దివ్యాంగులైన) అన్ని రకాలుగా శిక్షణ, సహకారం అందించి సాధారణ పిల్లలకు సమానంగా తీర్చిదిద్దడమే భవిత కేంద్రం ముఖ్య ఉద్దేశమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కొణిజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని భవిత కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు.
విద్యార్థులకు అందిస్తున్న శిక్షణ, వసతులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని చిన్నమునగాల ప్రాథమిక పాఠశాలలో నిర్వహించే ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును తనిఖీ చేశారు. విద్యార్థులతో చదివించారు. ఆంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి పౌష్టికాహారం, కోడిగుడ్లు అందించాలని సిబ్బందికి సూచించి, రికార్డు పుస్తకాలను పరిశీలించారు. భవిత కేంద్రంతో పాటు విద్యా సంస్థల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని గుత్తేదారులకు సూచించారు. కార్యక్రమంలో సీఎంవో ప్రవీణ్ కుమార్, విద్యా శాఖ ఈఈ బుగ్గయ్య, కొణిజర్ల మండల విద్యాధికారి అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
