హైదరాబాద్ , వెలుగు: ప్రజా ప్రభుత్వం వచ్చి డిసెంబర్ నాటికి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఈ కాలంలో వివిధ శాఖల పరిధిలో అమలు చేసిన పథకాలు, మేనిఫెస్టోలో పెట్టి ఇంకా అమలు కాని స్కీములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఆలస్యమవుతున్న హామీల జాబితాను కూడా తయారు చేయాలని చెప్పారు.
అంతేకాకుండా, ఆ పెండింగ్‌లో ఉన్న హామీలను భవిష్యత్తులో అమలు చేయాలంటే ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు ఆర్థిక భారం ఎంత? వాటిని అమలు చేస్తే అయ్యే మొత్తం ఖర్చు ఎంత? ఆ ఖర్చు కోసం ప్రస్తుతానికి అందుబాటులో నిధులు ఏ మేరకు ఉన్నాయి? నిధుల కొరత ఉంటే.. ప్రత్యామ్నాయంగా నిధులను ఎలా సమకూర్చుకోవాలి అనే దానిపై ఆర్థిక శాఖతో కలిసి ఒక పటిష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని సూచించారు.
ప్రభుత్వం రెండేండ్ల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో.. క్షేత్ర స్థాయిలో సంక్షేమ ఫలాల పంపిణీ తీరును సమీక్షించడంతో పాటు, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ సమగ్ర నివేదికను ఆధారం చేసుకోవాలని సీఎం భావిస్తున్నట్లు సెక్రటేరియెట్ వర్గాలు చెప్తున్నాయి.
